OG2: ఫ్యాన్స్‌కు డబుల్ కిక్.. 'ఓజీ-2' తాజా ట్వీట్ వైరల్
ABN, Publish Date - Jun 12 , 2026 | 10:48 AM
పవన్ కళ్యాణ్ OG-2 సినిమా గురించి ఆసక్తికర అప్‌డేట్. సుజీత్ విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చాక కీలక చర్చలు జరగనున్నట్లు సంకేతాలు. ఫ్యాన్స్‌లో పెరిగిన ఉత్సాహం.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన సినిమాలలో అన్నింటి కన్నా భారీ హైప్‌తో వచ్చిన సినిమా OG ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్.. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా కోసం సమయాన్ని కేటాయించి ఓజీని పూర్తి చేశారు. అంతా భావించినట్లుగానే గతేడాది రిలీజైన ఓజీ బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్నే సృష్టించింది. పవన్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ఓజీ నిలిచింది. దర్శకుడు సుజీత్ (Sujith) టేకింగ్, పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్వాగ్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. తొలి భాగం సాధించిన ఈ చారిత్రక విజయం తర్వాత సహజంగానే ఓజీ-2 పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఎప్పుడెప్పుడు ఈ సీక్వెల్ మొదలవుతుందా అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా అభిమానుల నిరీక్షణకు మరింత బలాన్నిస్తూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మాటిచ్చినట్లుగానే ఆయన కచ్చితంగా చేస్తారు. సరైన సమయం వచ్చినప్పుడు ఆ విషయాలను ఆయనే స్వయంగా వెల్లడిస్తారు. డైరెక్టర్ సుజీత్ విదేశాల నుంచి తిరిగి రాగానే దీనిపై చర్చిస్తాం అని ఈ ట్వీట్‌లో స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఒక ప్రాజెక్ట్ కమిట్ అయితే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ తాజా ప్రకటనతో మరోసారి స్పష్టమవుతోంది.
రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఓజీ-2ను సెట్స్ పైకి తీసుకెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దర్శకుడు సుజీత్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ భారీ సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, కొత్త లొకేషన్ల వేట కోసమే ఆయన ఈ పర్యటనకు వెళ్లినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ మరింత అడ్వాన్స్‌డ్‌గా డిజైన్ చేసే పనిలో సుజీత్ ఉన్నట్లు సమాచారం. సుజీత్ ఇండియాకు తిరిగి అడుగుపెట్టగానే పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ మీటింగ్‌లో ఓజీ-2 కథ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..
ఇక ఓజీ ఫస్ట్ పార్ట్ 300 కోట్ల భారీ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేశాయి. దానికి కొనసాగింపుగా రాబోతున్న ఈ రెండో భాగం అంతకు మించిన యాక్షన్ హంగులతో, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో తెరకెక్కనుందని టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఓజీ-2 సృష్టించబోయే విధ్వంసం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం సుజిత్ నానితో తెరకెక్కించబోయే బ్లడీ రోమియో చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నారు. నాని ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకాస్త సమయం ఉండడంతో ఓజీ-2 కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలయ్యే అవకాశం ఉంది.