Upasana Konidela: తండ్రి పిల్లలకు డైపర్ మారిస్తే అది గొప్పా..
ABN, Publish Date - Nov 14 , 2026 | 09:35 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల (Upasana Kamineni) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా కోడలిగా, ముగ్గురు పిల్లల తల్లిగా, బిజినెస్ విమెన్ గా ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల (Upasana Kamineni) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా కోడలిగా, ముగ్గురు పిల్లల తల్లిగా, బిజినెస్ విమెన్ గా ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఇక కొంచెం సమయం దొరికినా కూడా పిల్లల సంరక్షణ గురించి మహిళా సాధికారత గురించి పలు ఇంటర్వ్యూలలో వివరిస్తూ ఉంటుంది. ఇటీవల ఉపాసన పేరెంటింగ్ విధానాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. చరణ్ - ఉపాసన పెళ్లి అయిన పదేళ్లకు క్లీంకారా జన్మించింది. మూడేళ్ల తరువాత ఈ జంటకు కవలలు జన్మించారు. వారికి శివరామ్, అన్వీరా దేవి అని నామకరణం చేసిన విషయం తెల్సిందే.
సమాజంలో పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల బాధ్యతలపై ఆమె ఓపెన్‌గా తన అభిప్రాయాలను పంచుకుంది. పిల్లల బాధ్యతలను తండ్రులు నిర్వర్తించినంత మాత్రాన వారిపై అతిగా ప్రశంసల వర్షం కురిపించాల్సిన అవసరం లేదని, అది వారి బాధ్యత అని గుర్తుచేసింది. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. "తండ్రులు తమ పిల్లలకు ఆహారం తినిపించినా, డైపర్లు మార్చినా లేదా ఇతర చిన్నపాటి బాధ్యతలు చూసుకున్నా చుట్టూ ఉన్నవారు నువ్వు ఎంత గొప్ప తండ్రివి అంటూ తెగ అభినందిస్తుంటారు. అదేమీ గొప్ప విషయం కాదు. కానీ, అదే పని తల్లులు చేస్తే మాత్రం ఎవరూ ప్రత్యేకంగా గుర్తించి చప్పట్లు కొట్టరు, దాన్ని ఒక సాధారణ విషయంగా చూస్తారు.. పిల్లలను చూసుకోవడం, పెంచడం అనేది తండ్రులు ఎవరికో చేస్తున్న సహాయంకాదు, అది వారి ప్రాథమిక బాధ్యత మాత్రమే. మన ఆలోచనల్లో కూడా ఇద్దరికీ సమాన భాగం ఉండాలి. కొడుకు పని చేస్తే తప్పేంటి.. ? అతడేదో గొప్ప పని చేసినట్లు తల్లులు మురిసిపోతుంటారు. వారిని కూడా సమానంగా చూడాలి.
ఒకప్పుడు నేను కూడా అలానే చూసేదాన్ని. ఒక భార్యగా మొదట్లో రామ్ చరణ్ పిల్లలకు తినిపిస్తుంటే చాలా క్యూట్‌గా ఉందని భావించేదాన్ని. ఆ తరువాత ఇది తల్లిదండ్రులుగా ఎవరైనా చేసే సాధారణ పనేనని నాకు అర్ధమైంది. పిల్లలని చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. మన ఇంట్లోని ఆలోచనా విధానం మారడంతోనే అది మొదలవుతుందని' ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.