Tollywood: నిర్మాతకు భారం తగ్గించే దిశగా..
ABN, Publish Date - Jun 01 , 2026 | 02:13 PM
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో చాలామంది వందల కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నారని టాక్... వారికి అంత మొత్తాలు ఇస్తున్నదెవరు?... నిర్మాతలు ఏం కావాలి?.
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో చాలామంది వందల కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నారని టాక్... వారికి అంత మొత్తాలు ఇస్తున్నదెవరు?... నిర్మాతలు ఏం కావాలి?.. ఇలాంటి మాటలు వినిపిస్తూంటాయి... వాటి వెనకాలే ఓ కహానీ ఉంది... అదేంటో...!
అదీ సంగతి !
టాప్ స్టార్స్ నటించే సినిమాలన్నీ భారీ వ్యయంతో తెరకెక్కుతున్నాయి. పెట్టుబడికి తగ్గ రాబడి రావాలంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్టార్స్ సినిమాలను రిలీజ్ చేయవలసిందే. అందువల్ల వాటిని 'పాన్ ఇండియా మూవీస్'గానే రూపొందిస్తున్నారు. ఆల్ ఇండియాలో స్టార్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టే వారికి వందల కోట్లలో రెమ్యూనరేషన్స్ లభిస్తున్నాయి. అంతా బాగానే ఉంది - అయితే ఇకపై స్టార్స్ తో సింగిల్ ప్రొడ్యూసర్ సినిమాలు తీసే పరిస్థితి లేదనీ అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగానే కొందరు నిర్మాతలు కలసి ఓ ప్రాజెక్ట్ లో పాలుపంచుకుంటున్నారు. అందులోనూ హీరోలు కూడా పార్ట్నర్స్ గా మారుతున్నారు. దీంతో మొదట్లోనే స్టార్ హీరోస్ కు భారీ పారితోషికాలు ఇచ్చే పరిస్థితి తప్పుతోంది. అలా హై-బడ్జెట్ మూవీస్ ను రూపొందించ గలగుతున్నారు. బిజినెస్ అయిన తరువాత హీరోలు కోరినట్టుగా వందల కోట్ల పారితోషికాలు ఇస్తున్నారు. అదీ సంగతి!
భవిష్యత్ లో మరికొందరు...
స్టార్స్ నటించే సినిమాల్లో వారు సైతం భాగస్వాములుగా మారడం ఆరోగ్యకరమైన అంశమే!. ఎందుకంటే అనవసర ఖర్చులు తగ్గుతాయి. ప్రాజెక్ట్ పై బాధ్యత పెరుగుతుంది. అంతేకాదు, వారు ఆశించిన స్టాండర్డ్స్ లో సినిమాను రూపొందించే వీలు కలుగుతుంది... ఔట్ పుట్ బాగా వస్తే - తప్పకుండా ప్రేక్షకులు సదరు చిత్రాలను ఆదరిస్తారు... అనుకున్న ఫలితం దక్కుతుంది. సినిమాలు దేశవ్యాప్తంగా విడుదల కావడం వల్ల భారీ వసూళ్ళు లభిస్తాయి. ఒకవేళ సినిమాకు టాక్ అంత బాగోక పోయినా నిర్మాతలకు భారీ నష్టాలు మాత్రం వాటిల్లవు. ఈ కారణంగానే నిర్మాతలు కూడా స్టార్ హీరోస్ ను తమ ప్రాజెక్ట్స్ లో పార్ట్నర్స్ గా చేసుకుంటున్నారు... ఇప్పటికే ఈ దిశగా టాలీవుడ్ టాప్ స్టార్స్ సాగుతున్నారు. భవిష్యత్ లో మరికొందరు ఆ రూటులోనే పయనిస్తారని చెప్పొచ్చు.
కంటెంట్ ప్రధానం... !
టాప్ స్టార్స్ స్ఫూర్తితో మరికొందరు యంగ్ హీరోస్ తమ చిత్రాల నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. తెలుగునాట 10 కోట్లు పారితోషికం తీసుకొనే హీరోల్లో చాలామంది ఇదే రూటులో సాగాలని ఆశిస్తున్నారు. తాము నటించే ప్రాజెక్ట్స్ భారీగా రూపొందడానికి ముందుగా కాస్త అడ్వాన్స్ తీసుకొని, తర్వాత సినిమా బిజినెస్ అయ్యాకే లెక్కలు చూసుకుంటున్నారు. అలా ఇకపై తెలుగునాట సోలో ప్రొడ్యూసర్ అన్న కాన్సెప్ట్ ఉండదని పరిశీలకులు భావిస్తున్నారు. అంతా బాగానే ఉంది- నిర్మాతలతో పాటు స్టార్స్ భాగస్వాములయినంత మాత్రాన లాభాలు రావు... చిన్న సినిమాకైనా- పెద్ద చిత్రానికైనా కంటెంట్ ముఖ్యమన్న విషయం మరచిపోరాదు. కథాబలం బాగుంటే ప్రజాదరణ పొందుతాయి. తద్వారా కోరుకున్న విజయాలు సొంతమవుతాయి. ఈ విధానం ఇలాగే కొనసాగితే మునుముందు ఓటీటీల హవా తగ్గి, మళ్ళీ థియేటర్స్ కు జనం రావచ్చుననీ పరిశీలకులు భావిస్తున్నారు... ఏమవుతుందో చూడాలి...