నాగార్జున సినిమాలు.. పాన్ ఇండియానా? సూర్య కామెంట్స్.. ఫ్యాన్స్ ట్రోల్స్
ABN, Publish Date - Nov 04 , 2026 | 01:24 PM
'పాన్ ఇండియా మూవీ' అనే మాట ఇప్పుడు సినీ ఫ్యాన్స్ లో ఎక్కడ చూసినా వినిపిస్తోంది. స్టార్స్ సైతం ఆ పదాన్ని భలేగా వల్లిస్తున్నారు. ఇంతకూ 'పాన్ ఇండియా మూవీ' అంటే ఏంటో చాలామందికి తెలియడం లేదు. ఎందుకలాగా?.
'పాన్ ఇండియా మూవీ' అనే మాట ఇప్పుడు సినీ ఫ్యాన్స్ లో ఎక్కడ చూసినా వినిపిస్తోంది. స్టార్స్ సైతం ఆ పదాన్ని భలేగా వల్లిస్తున్నారు. ఇంతకూ 'పాన్ ఇండియా మూవీ' అంటే ఏంటో చాలామందికి తెలియడం లేదు. ఎందుకలాగా?.
ఇప్పుడు అందరూ 'పాన్ ఇండియా' అంటున్నారు. తెలుగు హీరో నాగార్జున (Nagarjuna) ఎప్పుడో 'పాన్ ఇండియా మూవీ' చేశారని సీన్ (Scene) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) అన్నారు. 'పాన్ ఇండియా' అంటే పలు సినిమా రంగాలను మిళితం చేయడమని సూర్య అభిప్రాయపడ్డారు. అలా నాగార్జున ఎప్పుడో చేశారని సూర్య చెప్పారు. సూర్య హీరోగా రూపొందిన 'సీన్' నవంబర్ 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగానే హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో 'పాన్ ఇండియా మూవీస్'ను నాగ్ ఎప్పుడో చేశారని అన్నారు.
నాగార్జున పలువురు పరభాషా దర్శకులతో కలసి పనిచేశారని, అలా ఇతర భాషల వారిని మిళితం చేయడం పాన్ ఇండియా అన్నది సూర్య ఉద్దేశం కావచ్చు. కానీ 'పాన్ ఇండియా మూవీ' అంటే ఆల్ ఇండియాలో రిలీజయ్యే సినిమాను అలా పిలుస్తారన్నది అసలు అర్థం. అందుకే కేవలం తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రాలనైనా, ఇతర దక్షిణాది భాషల్లో నిర్మితమైన సినిమాలనైనా 'పాన్ ఇండియా మూవీస్' అని పిలువలేం. తప్పకుండా ఉత్తరాదిన హిందీ భాషలోనూ అనువాదమై, లేదా రూపొంది రిలీజ్ అయితేనే దానిని పాన్ ఇండియా మూవీ అనగలం. ఇక్కడే సూర్య అభిప్రాయాన్ని సినీ ఫ్యాన్స్ తప్పు పడుతున్నారు.
ఆల్ ఇండియాలోని ప్రధాన కేంద్రాలలో ఏకకాలంలో విడుదలయ్యే చిత్రాలను 'పాన్ ఇండియా మూవీస్' అంటున్నారు. అదే అసలైన అర్థం కూడా. అలా తెలుగు నుండి రిలీజయిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ యన్టీఆర్, భానుమతి నటించిన 'చండీరాణి' అనే చెప్పాలి. ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజయింది. తరువాత అలా రిలీజైన సినిమా ప్రభాస్- రాజమౌళి కాంబోలో వచ్చిన 'బాహుబలి' సిరీస్ అనే చెప్పాలి. సూర్య అన్నట్టు నాగార్జున ఇతర భాషల దర్శకులతో కలసి పనిచేశారు. ఆ సినిమాలన్నీ ఆల్ ఇండియాలో ఒకేసారి రిలీజ్ కాలేదు.
నాగ్ నటించిన డైరెక్ట్ హిందీ మూవీస్ లోనూ కొన్ని సౌత్‌లో ఇతర రాష్ట్రాల్లో విడుదల కాలేదని తెలుస్తోంది. ఇక నాగ్ లాగే పరభాషా దర్శకులతో కలసి రజనీకాంత్, కమల్ హాసన్ ఎప్పుడో పనిచేశారు. ఈ మధ్య కాలంలో నాగ్ నటించిన 'కుబేర, కూలీ' సినిమాలు పాన్ ఇండియా మూవీస్‌గా వచ్చాయి. ఏది ఏమైనా పరభాషా దర్శకులతో పనిచేసినంత మాత్రాన సదరు చిత్రాలను పాన్ ఇండియా మూవీస్ అనలేం. హిందీతో పాటు మరో మూడు, నాలుగు భాషల్లో నార్త్, సౌత్ లో రిలీజయ్యే సినిమాలనే 'పాన్ ఇండియా మూవీస్' అంటారు.
ఏది ఏమైనా ఈ మధ్య స్టార్స్ మాటల్లో ఏదైనా తప్పు దొర్లితే దానిని పట్టుకొని నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఆ ట్రోల్స్ సినిమాలకు ప్లస్ గానూ మారుతున్నాయి. మరికొన్ని సార్లు దెబ్బేస్తున్నాయి. ఇప్పుడు 'సీన్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సూర్య మాటలను కొందరు తప్పు పడుతున్నారు. అలాగే ఇన్నేళ్ళయినా సూర్య తెలుగులో మాట్లాడక పోవడాన్నీ కొందరు విమర్శిస్తున్నారు. మరి 'సీన్' సినిమా ప్రచారానికి ఈ అంశాలన్నీ కలసి దోహదపడతాయేమో చూడాలి.