సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అయ్యో.. సొంత ఫ్యామిలీనే అలా చేసిందా!

ABN, Publish Date - Jul 29 , 2026 | 02:58 PM

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. వెండితెర మీద మెరిసిపోవాలని, స్టార్ డమ్ తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ ఆ రంగుల వెనుక ఎన్నో కన్నీటి గాథలు దాగి ఉంటాయన్న వాస్తవం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Bhagyashri Borse

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. వెండితెర మీద మెరిసిపోవాలని, స్టార్ డమ్ తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ ఆ రంగుల వెనుక ఎన్నో కన్నీటి గాథలు దాగి ఉంటాయన్న వాస్తవం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఒక అమ్మాయి హీరోయిన్‌గా ఎదగాలంటే.. బయటి ప్రపంచం సంగతి పక్కన పెడితే, ముందు సొంత ఇంట్లోనే పెద్ద యుద్ధం చేయాల్సి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి చేదు అనుభవాలనే ఎదుర్కొని, కన్నీళ్లను దిగమింగుకుని.. స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse).

మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి అలుపెరగని పోరాటం చేసింది. ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.. తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే వచ్చింది. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లెనిన్ (Lenin) సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఒక్క విజయంతో ఆమె దశ తిరిగిపోయింది. ఎంతో మంది సీనియర్ హీరోయిన్లను వెనక్కి నెట్టి.. నేరుగా టాప్ హీరోయిన్ల రేసులో ముందువరసలో నిలబడింది.

అయితే.. ఈ టాప్ హీరోయిన్ సక్సెస్ వెనుక ఎవరికీ తెలియని ఒక బాధాకరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉందట. సినిమాల్లోకి రావడం భాగ్యశ్రీ ఇంట్లో ఎవరికీ ఏమాత్రం ఇష్టం లేదట. అసలు తన కోరికను ఇంట్లో చెప్పినప్పుడు ఒక పెద్ద భూకంపమే వచ్చింది. మొదట తన తల్లికి ఫోన్ చేసి.. అమ్మా నేను సినిమాల్లోకి వెళ్తాను అని అడిగితే.. వెంటనే నిర్మొహమాటంగా వద్దని తేల్చి చెప్పేసిందట. పోనీ నాన్న అయినా అర్థం చేసుకుంటారేమో అని ఆయనకు కాల్ చేస్తే.. అమ్మ వద్దన్న పని నువ్వు ఎలా చేస్తావని ఆయన కూడా గట్టిగా వ్యతిరేకించారు. కనీసం అక్క అయినా సపోర్ట్ చేస్తుందని ఆశపడితే.. ఆమె కూడా తల్లిదండ్రులకే వత్తాసు పలికింది. ఇలా సొంత కుటుంబంలో అందరూ ఆమెకు నో చెప్పారు.

సొంత కుటుంబమే తన కలలను కాదన్నా.. భాగ్యశ్రీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సినిమా రంగంపై ఉన్న మక్కువతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ విషయం ఇంట్లో తెలిసి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కన్న కూతురు అని కూడా చూడకుండా.. కోపంతో భాగ్యశ్రీ తల్లి ఆమెను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది. ఏకంగా ఆరు నెలల పాటు కనీసం మాటలు కూడా లేవు. ఆ సమయంలో తాను ఎంతలా ఏడ్చిందో, ఎంత నరకం అనుభవించిందో ఇప్పుడు నవ్వుతూ చెబుతున్నప్పటికీ.. అప్పట్లో ఆ బాధ మాటల్లో చెప్పలేనిది అంటోంది ఈ ముద్దుగుమ్మ.

ఒక సామాన్య అమ్మాయి హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి రావాలంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో తన సింగిల్ స్టేట్‌మెంట్‌తో చెప్పి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఎన్ని కష్టాలు వచ్చినా, సొంత వాళ్లే దూరమైనా తన లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు భాగ్యశ్రీ. కట్ చేస్తే.. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నిన్నటి వరకు వద్దన్న వాళ్లే నేడు గర్వపడే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. 'లెనిన్' ఇచ్చిన భారీ సక్సెస్‌తో తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందని ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినిపిస్తోంది.

Updated Date - Jul 29 , 2026 | 03:16 PM