Vishal: మా కల నిజమవుతోంది.. నడిగర్ సంఘం భవనంపై విశాల్ ఎమోషనల్ పోస్ట్
ABN, Publish Date - Jul 14 , 2026 | 03:54 PM
‘మా కల త్వరలో నెరవేరబోతోంది. దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ప్రతిష్ఠాత్మక భవన నిర్మాణం తుదిదశకు చేరుకుందని చెప్పడానికి ఎంతో ఆనందిస్తున్నా’ అని సంఘం ప్రధాన కార్యదర్శి హీరో విశాల్ అన్నారు.
‘మా కల త్వరలో నెరవేరబోతోంది. దక్షిణ భారత నటీనటుల సంఘం (Nadigar Sangam-నడిగర్ సంఘం) ప్రతిష్ఠాత్మక భవన నిర్మాణం తుదిదశకు చేరుకుందని చెప్పడానికి ఎంతో ఆనందిస్తున్నా’ అని సంఘం ప్రధాన కార్యదర్శి హీరో విశాల్ (Vishal) అన్నారు. తాజాగా జరిగిన మీటింగ్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ‘నడిగర్ సంఘం కార్యాలయంతో నా కుటుంబం, నా టీమ్ మొత్తాన్ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా మా అందరి కలగా ఉన్న నడిగర్ సంఘం భవనం నిర్మాణం ఇప్పుడు తుది దశకు చేరుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఈ ప్రాజెక్ట పూర్తి చేయడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఈ ప్రయాణం అంత ఈజీగా జరగలేదు. అనేక పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరంతర శ్రమ, అంకితభావంతో కూడిన ప్రయాణమిది. ఆ సవాళ్లన్నింటినీ అధిగమించి నిర్మాణం చివరి దశకు చేరుకోవడం ప్రతి సభ్యుడి కృషికి నిదర్శనం. మా లక్ష్యం నెరవేరడంలో టీమ్ అంతా నిరంతరం శ్రమించిందని, ప్రతి ఒక్కరి సహకారం, ఐకమత్యం, నిబద్థత వల్లే ఈ కల నిజమవుతోంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నడిగర్ సంఘం సొంత భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఇక ఎంతో దూరంలో లేదు. దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా సంఘంపె, సభ్యులపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’ అని విశాల్ పేర్కొన్నారు.