Haindava: 'హైందవ’ వాయిదా వెనుక అసలు కథ ఇదేనా?
ABN, Publish Date - Nov 21 , 2026 | 01:29 PM
టాలీవుడ్లో సినిమాల విడుదల తేదీలు మారడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. భారీ బడ్జెట్ చిత్రాల నుంచి చిన్న, మీడియం రేంజ్ సినిమాల వరకు ఏదో ఒక కారణంతో వాయిదాల బాట పడుతున్నాయి.
టాలీవుడ్లో సినిమాల విడుదల తేదీలు మారడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. భారీ బడ్జెట్ చిత్రాల నుంచి చిన్న, మీడియం రేంజ్ సినిమాల వరకు ఏదో ఒక కారణంతో వాయిదాల బాట పడుతున్నాయి. ఇప్పటికే ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ వంటి భారీ చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకోగా, ‘వారణాసి’ విషయంలోనూ అనేక చర్చలు సాగుతున్నాయి. తాజాగా వాయిదాల జాబితాలోకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘హైందవ’ కూడా చేరింది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఓటీటీ ఒప్పందాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయని, ఫస్ట్ కాపీ కూడా సిద్ధంగా ఉందని తెలిసింది. అయినప్పటికీ ఓటీటీ సంస్థల నుంచి ఎదురైన కొన్ని అభ్యంతరాల కారణంగానే విడుదలను వాయిదా వేయాల్సి వచ్చిందని ఇన్సైడ్ టాక్.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మరో చిత్రం ‘టైసన్ నాయుడు’ డిసెంబర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఒకే హీరో నటించిన రెండు సినిమాలు తక్కువ వ్యవధిలో థియేటర్లలోకి వస్తే డిజిటల్ హక్కుల బిజినెస్ పై ప్రభావం పడే అవకాశం ఉందని ఓటీటీ సంస్థలు భావిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఒక నటుడి సినిమాల మధ్య కనీసం రెండు నెలల వ్యవధి ఉండాలన్నది డిజిటల్ సంస్థల రూల్. ఈ నేపథ్యంలోనే రెండు చిత్రాల్లో ఒకదాని విడుదల తేదీని మార్చాలని నిర్మాతలకు సూచించినట్లు సమాచారం.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ‘టైసన్ నాయుడు’ను మరింత ఆలస్యం చేస్తే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే ప్రమాదం ఉందని భావించినట్లు సమాచారం. దీంతో ఆ సినిమా విడుదలకు రూట్ క్లియర్ చేసేందుకు ‘హైందవ’ను వెనక్కి జరిపారని టాక్. ఇదే నిజమైతే సినిమా విడుదల తేదీలను నిర్ణయించడంలో ఓటీటీ సంస్థల ప్రభావం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ‘టైసన్ నాయుడు’ డిసెంబర్లో విడుదలైతే, దాని తర్వాత రెండు నెలల గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. జనవరిలో సంక్రాంతి సినిమాల సందడి ఉండటంతో ఆ సమయంలో ‘హైందవ’ను విడుదల చేసే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. దీనిని బట్టి ఫిబ్రవరిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.