సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

shavukaru janaki: 'షావుకారు'తో తెరంగేట్రమ్!

ABN, Publish Date - Aug 21 , 2026 | 02:57 PM

ప్రముఖ నటీమణి శంకరమంచి జానకి... తన తొలి చిత్రం 'షావుకారు'నే ఇంటిపేరుగా మార్చేసుకుంది. 76 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 7, 1950లో విడుదలైన ఆ సినిమా జానకి జీవితాన్ని మార్చేసింది.

ప్రముఖ నటీమణి శంకరమంచి జానకి... తన తొలి చిత్రం 'షావుకారు'నే ఇంటిపేరుగా మార్చేసుకుంది. 76 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 7, 1950లో విడుదలైన ఆ సినిమా జానకి జీవితాన్ని మార్చేసింది. నిజానికి జానకికి తొలి అవకాశం కె.వి. రెడ్డి దర్శకత్వం వహించిన 'గుణసుందరి కథ'కు వచ్చింది. అదెలాగంటే... మద్రాసు ఆకాశవాణిలో రేడియో అన్నయ్య, అక్కయ్య, వింజమూరి సీతాదేవి, టి.జి. కమలాదేవి, తెన్నేటి హేమలత, ఎ.పి. కోమల, కొంగర జగ్గయ్య, సిహెచ్. నారాయణరావు, ఎస్వీ రంగారావు, గుమ్మడి తదితరులతో పిన్న వయసులోనే జానకి పలు కార్యక్రమాలలో పాల్గొనేది. మొదటి నుంచి ఆమె వాచకానికి మంచి గుర్తింపు ఉండేది. ఒకసారి రేడియోలో జానకి వాయిస్ విన్న బి.ఎన్. రెడ్డి డైరెక్ట్ గా రేడియో స్టేషన్ కు వచ్చేశారు. జానకిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆ తర్వాత ఒకసారి బుచ్చిబాబు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న బి.ఎన్. రెడ్డి జానకిని చూసి 'నువ్వెవరి పిల్లవు?' అని ప్రశ్నించారు. టేకుమళ్ళ వారమ్మాయిని'ని అని జానకి బదులిచ్చింది. 'సినిమాల్లో వేషం వేస్తావా' అని ఆయన అడిగేతే, మా నాన్నగారు పళ్ళు రాలగొడతారు... అని సమాధానం ఇచ్చింది జానకి. అప్పట్లో ఆయన 'గుణసందరి కథ' సినిమా తీస్తున్నారు. హీరోయిన్ గా అడిగితే, తండ్రి భయంతో ససేమిరా అనేసింది జానకి. అప్పటికి ఆమెకు కేవలం 15 సంవత్సరాల వయస్సే. ఆ తర్వాత ఆ పాత్రను ఎందుకు వదులుకున్నానా? అని బాధపడింది జానకి.

1947 నవంబర్ 5న ఆమె వివాహం శంకరమంచి శ్రీనివాసరావుతో అయ్యింది. ఆయన రేడియో ఇంజనీర్. అయితే ఆస్తిపంపకాలలో జరిగిన అన్యాయంతో శ్రీనివాసరావు వివాహానంతరం ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. దాంతో జానకి మనసు సినిమాలవైపు మళ్ళింది. దాంతో ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు, కొమ్మూరి పద్మావతి ప్రోత్సాహంతో ఆమె బి.ఎన్.రెడ్డిని కలిసింది. ఒకప్పుడు వేషం ఇస్తానంటే తిరస్కరించిన జానకి మూడేళ్ళ తర్వాత అదే దర్శకుడి దగ్గరకు వేషం కోసం వెళ్ళాల్సి వచ్చింది. జానకి పట్ల అభిమానంతో బి.ఎన్.రెడ్డి... ఆమెను నాగిరెడ్డి దగ్గరకు పంపారు. అప్పుడు వారు 'షావుకారు' సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. బి.ఎన్.రెడ్డి రికమండేషన్ కారణంగా జానకికి చక్రపాణి, ఎల్.వి. ప్రసాద్‌ మేకప్ టెస్ట్ చేయించారు. కొన్నాళ్ళకు ఆమెకు పిలుపొచ్చింది. ఏదో చిన్న వేషం ఇస్తారనుకుంటే... వాళ్ళు అందులో కథానాయిక నువ్వే అని చెప్పడంతో జానకి అవాక్కయ్యింది. అలా ఆమె సినీ జీవితం విజయా వారి 'షావుకారు'తో శ్రీకారం చుట్టుకుంది. తొలి సినిమాకు గానూ ఆమె అందుకున్న పారితోషికం రెండువేల ఐదు వందల రూపాయలు. 'షావుకారు' తర్వాత విజయ సంస్థలో మరే సినిమాలోనూ షావుకారు జానకి నటించలేదు. అయితే ఆ చిత్ర నిర్మాణ సమయంలో నేర్చుకున్న పాఠలే తన చలన చిత్ర జీవితానికి మంచి పునాది ఏర్పడటానికి కారణమయ్యాయని జానకి చెబుతుండేవారు. 'షావుకారు' సినిమా గురించి తెలుగు స్వతంత్ర పత్రికలో ఖాసా సుబ్బారావు 'కుటుంబ స్త్రీల సినీ రంగ ప్రవేశం' అని రాయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆమె తెలిపారు.

Updated Date - Aug 21 , 2026 | 02:57 PM