మరోసారి దిల్ రాజు Vs మైత్రీ! ఈసారి ఏమయ్యేనో
ABN, Publish Date - Aug 27 , 2026 | 03:40 PM
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దసరా రేసు రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. పాన్ ఇండియా సినిమాల మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంటోంది.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దసరా రేసు రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. పాన్ ఇండియా సినిమాల మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంటోంది. రౌడీస్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పీరియాడిక్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా రణబాలి (Ranabaali). రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగే చారిత్రాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
పెళ్లి తర్వాత విజయ్, రష్మిక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం ఒక ప్రత్యేకత అయితే, హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్ పాత్రలో నటిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను విపరీతంగా పెంచేసింది. అయితే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి తాజాగా ఓ కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. మొదట ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ విడుదల తేదీని అక్టోబర్ 16వ తేదీకి పోస్ట్ పోన్ చేస్తూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
అయితే ఈ డేట్ చేంజ్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పెద్ద కల్లోలమే సృష్టించేలా కనిపిస్తోంది. అక్టోబర్ 16న రణబాలి థియేటర్లలోకి వస్తుంటే.. సరిగ్గా దానికి ఒక్క రోజు ముందు, అంటే అక్టోబర్ 15నే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో వస్తున్న జైలర్ 2 (Jailer 2) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి భాగం సంచలన విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద ఏకంగా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడంతో.. రెండో పార్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ధనుష్ (Dhanush) ఓమ్ (Om – Chapter 1) సినిమా తన రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే, బాక్సాఫీస్ వద్ద అసలైన పోటీ రజినీకాంత్ జైలర్ 2 అలాగే విజయ్ దేవరకొండ రణబాలి మధ్యే జరగనుంది. రజినీకాంత్ చిత్రానికి కోలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తిరుగులేని క్రేజ్ ఉంది. ఇలాంటి భారీ పోటీని తట్టుకుని ఏ సినిమా నిలబడుతుంది..? దసరా పండుగ సీజన్‌ను ఏ హీరో క్యాష్ చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. థియేటర్ల పరంగా, కలెక్షన్ల పరంగా ఈ సినిమాల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. హీరోల పరంగా రజనీకాంత్ క్రేజ్‌ను విజయ్ మ్యాచ్ చేయలేకపోయినా కలెక్షన్స్ పరంగా మాత్రం రెండిటిపై బాగా ఎఫెక్ట్ పడే అవకాశముంది..
ఇది చాలదన్నట్లుగా రణబాలి రిలీజ్ అయ్యే రోజే ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి వంటి స్టార్స్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ పాన్ ఇండియా చిత్రం ఓమ్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా కేవలం రెండు రోజుల్లోనే మూడు పెద్ద పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో థియేటర్ల సర్దుబాటు, కలెక్షన్ల పరంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రణబాలి సినిమా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers ) వాళ్లది కాగా జైలర్2 సినిమాను దిల్ రాజు (Dil Raju), సునీల్ నారంగ్ కాంబో ఎస్వీసీ (SVC) విడుదల చేస్తుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఇరుముడి థియేటర్లను దిల్ రాజు టాక్సిక్‌కు ఇవ్వడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు నెల గడవక మునుపే రణబాలి వర్సెస్ జైలర్2 పోటీ పడుతుండడంతో అప్పుడే ఈ విషయంపై నెటిజన్లు తమ పోస్టులతో చెలరేగి పోతున్నారు.