మ్యూజిక్ మ్యాజిక్.. తడబడుతున్న టాలీవుడ్! దూసుకుపోతున్న కోలీవుడ్
ABN, Publish Date - Feb 26 , 2026 | 08:38 AM
ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నా, టెక్నికల్ అంశాల్లో మాత్రం అందులోని తమిళ పరిశ్రమ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటోంది.
ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నా, టెక్నికల్ అంశాల్లో మాత్రం ఇందులోని తమిళ పరిశ్రమ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటోంది. ముఖ్యంగా మ్యూజిక్ కంపోజిషన్ విషయంలో కోలీవుడ్ చూపిస్తున్న పట్టు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒక సినిమాలో సంగీతం బాగుంటే సగం విజయం ఖాయం అన్న సూత్రాన్ని తమిళ మేకర్స్ గట్టిగా నమ్ముతారు. అందుకే అక్కడ ప్రతిభావంతులైన సంగీత దర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం దాదాపు పదిమంది అగ్రశ్రేణి సంగీత దర్శకులు ఉన్నారు. వీరంతా కేవలం పాటలే కాకుండా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమా స్థాయిని మార్చేయగల సమర్థులు. ఒక్కొక్కరు ఒక్కో విభిన్న శైలిని కలిగి ఉండటం వల్ల ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త అనుభూతి లభిస్తుంది. ఈ సంగీత దర్శకుల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన పోటీ వల్ల పరిశ్రమ నిరంతరం అద్భుతమైన ఆల్బమ్‌లతో కళకళలాడుతోంది.
ఇప్పుడున్న ట్రెండ్‌లో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. 'ది ప్యారడైజ్' సినిమాలోని 'ఆయా షేర్' సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. అనిరుధ్‌తో పాటు సాయి అభ్యంకర్ లాంటి కొత్త వాళ్లు దూసుకొస్తున్నారు. ఇక లెజెండరీ ఏఆర్ రెహమాన్ (A.R. Rahman), యువరాజా యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja), మెలోడీ కింగ్ హారిస్ జయరాజ్ (Harris Jayaraj), జీవీ ప్రకాష్ (G.V. Prakash Kumar), సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) వంటి వారు నిలకడగా హిట్స్ ఇస్తూ కోలీవుడ్‌ను మ్యూజిక్ పరంగా స్ట్రాంగ్‌గా ఉంచుతున్నారు.
అదే తెలుగు సినిమా విషయానికి వస్తే.. పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రస్తుతం కేవలం ఇద్దరు ప్రధాన సంగీత దర్శకులపైనే విపరీతంగా ఆధారపడుతోంది. వారే దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇంకా ఎస్.ఎస్ థమన్. (Thaman S) భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల ప్రాజెక్టులు అంటే దాదాపుగా ఈ ఇద్దరి పేర్లే వినిపిస్తాయి. దీనివల్ల ప్రేక్షకులకు ఒకే రకమైన సౌండ్ వినబడుతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి.
దురదృష్టవశాత్తూ, ఈ ఇద్దరు టాప్ కంపోజర్స్ కూడా ఇటీవలి కాలంలో తమ అత్యుత్తమ ఫామ్‌ను నిలకడగా ప్రదర్శించలేక పోతున్నారు. కొన్ని పాటలు బాగున్నా, ఆల్బమ్ మొత్తం ఆకట్టుకోవడంలో తడబడుతున్నారు. కొంతమంది కుర్ర సంగీత దర్శకులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నప్పటికీ, పెద్ద సినిమాల భారాన్ని మోయగల సామర్థ్యం, సొంత ముద్ర వేయడంలో వారు ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. ఇక కీరవాణి (M.M. Keeravani), మిక్కీ జే మేయర్ (Mickey J. Meyer), అనూప్ రూబెన్స్ (Anup Rubens), భీమ్స్ సిసిరోలియో వంటి ప్రసిద్దులు ఉన్నప్పటికీ వారు మెరుపు తీగలా అలా వచ్చి ఇలా మెరిసి షేక్ చేసి పోతున్నారు తప్పితే వీరి నుంచి రెగ్యులర్‌గా చిత్రాలేవి రావడం లేదు.
మొత్తానికి చూస్తే, టెక్నికల్ ఎక్సలెన్స్, మ్యూజిక్ కంపోజిషన్‌లో తమిళ సినిమా తెలుగు కంటే చాలా ముందు వరుసలో నిలుస్తోంది. కొత్త సంగీత దర్శకులను ఎంకరేజ్ చేయడంలో ఇంకా వారి నుంచి బెస్ట్ అవుట్‌పుట్ రాబట్టుకోవడంలో తెలుగు మేకర్స్ మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సినీ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు. అప్పుడే మ్యూజిక్ పరంగా మన టాలీవుడ్ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని అంటున్నారు.