సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: ‘ఓం శాంతి డిస్కో శాంతి’... సెన్సార్‌ వేటు తప్పదా!?

ABN, Publish Date - Apr 20 , 2026 | 01:31 PM

మహి వి రాఘవ్‌ షో రన్నర్‌గా 'ఓంశాంతి డిస్కో శాంతి' అనే సినిమా తెరకెక్కుతోంది. గోగు ఆర్.ఆర్. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివ మేక, సాహితి చింతలపూడి నిర్మిస్తున్నారు.

Om Shanthi Disco Shanthi Movie

కొంతమంది మేకర్స్... కావాలనే కాంట్రవర్సీలకు తెర తీస్తుంటారు. ఆ రకంగా తమ చిత్రం మీడియాలో బాగా నానుతుందనే నమ్మకంతో బహుశా అలా చేస్తుండవచ్చు! తాజాగా విడుదలైన ఓ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను చూస్తే అదే అనిపిస్తుంది. గతంలో 'పాఠశాల, ఆనందోబ్రహ్మా, యాత్ర' వంటి చిత్రాలను తెరకెక్కించిన మహి వి రాఘవ్‌... ఆ మధ్య 'సేవ్‌ ద టైగర్‌' వెబ్ సీరిస్‌నూ రెండు సీజన్స్ గా నిర్మించారు. ఇప్పుడు ఆయన ఓ సినిమాకు షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. అదే 'ఓం శాంతి డిస్కో శాంతి'. గోగు ఆర్. ఆర్. దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను సమకూర్చడంతో పాటు షో రన్నర్‌గా మహి వి. రాఘవ్ వ్యవహరిస్తున్నారు. ఈ 'ఓం శాంతి డిస్కో శాంతి' అనే టైటిల్‌కు 'ఆల్ రెడీ కాషన్‌ కియా... ఆల్ రెడీ' అనే ట్యాగ్‌ లైన్‌ పెట్టారు.


ఈ పదాలు 'అఖండ 2' సినిమా రిలీజ్‌కు ముందు ముంబైలో జరిగిన ప్రమోషన్స్ సందర్భంలో ఆ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను వాడినవి. ఆ సినిమా రిలీజ్‌ టైమ్‌లో ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో రీల్స్‌గా చేసి, బాగా ట్రోల్‌ చేశారు. యాంకర్‌ సుమ ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలోనూ బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్‌తో మాట్లాడినప్పుడు... బోయపాటి శ్రీను 'అందులో నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. నాకు వచ్చిన హిందీలో ఎదుటి వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాను' అని స్పష్టం చేశారు. నిజానికి బోయపాటి డైలాగ్‌ను ఈ సినిమాకు ట్యాగ్‌లైన్‌గా పెట్టడాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ... సినిమా టైటిలే అభ్యంతరకరంగా ఉందని కొందరంటున్నారు.

'ఓం శాంతి డిస్కో శాంతి' అనే పేరు సినిమాకు పెట్టడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రియల్‌ స్టార్ శ్రీహరి ఇవాళ భౌతికంగా మన మధ్య లేరు. ఆయన భార్య శాంతి కుమారిని సినిమా రంగంలో అందరూ 'డిస్కో శాంతి' అనే సంభోదిస్తారు. ఎన్నో చిత్రాలలో ఐటమ్‌ సాంగ్స్‌లో నటించి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారావిడ. ఆమె పేరు 'డిస్కో శాంతి'ని సినిమా టైటిల్ లో వాడటం పద్ధతిగా లేదన్నది వారి వాదన. అలానే 'ఓం శాంతి' అనే పదాన్ని ఇవాళ సోషల్ మీడియాలో ఎవరైనా తుదిశ్వాస విడిస్తే... రిప్‌... రెస్ట్‌ ఇన్ పీస్‌కు పర్యాయపదంగా వాడుతున్నారు. ఈ రెండు పదాలను కలిపేసి 'ఓం శాంతి... డిస్కో శాంతి' అని పెట్టడం ఏ మాత్రం సబబుగా లేదని కొందరంటున్నారు. ప్రచారం కోసం మేకర్స్ ఈ టైటిల్‌ పెట్టుకున్నా... రేపు సినిమా విడుదలకు ముందు ఖచ్చితంగా సెన్సార్‌ నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతాయని మరికొందరు ముందే ఊహాగానాలు చేస్తున్నారు.


ఇక ఈ సినిమా విషయానికి వస్తే... 'ఇప్పటి వరకూ దెయ్యాలు మనుష్యులను భయపెట్టే సినిమాలు వచ్చాయి. కానీ ఆ దెయ్యాలకే భయం పుట్టించే వాళ్ళు ఎదురైతే? ఏమిటి పరిస్థితి. అసలు భయం అంటే తెలియని పిచ్చివాళ్ళు ఈ దెయ్యాల ముందుకు వస్తే, దెయ్యాలు వర్సెస్ పిచ్చివాళ్ళు మధ్య జరిగే ఓ గందరగోళమైన ఫుల్‌ ఫన్ రైడర్‌గా ఈ సినిమా ఉంటుంది' అని మేకర్స్ చెబుతున్నారు. అసలు దెయ్యాలు పిచ్చివాళ్ళను భయపెట్టగలవా? పిచ్చివాళ్ళే తిరగబడి దెయ్యాల్ని భయపెడతారా? అనేది ఆసక్తికరమైన అంశమని, జంప్‌ స్కేర్‌, ఫన్నీ డైలాగ్స్, ఊహించని ట్విస్టులతో ఈ సినిమా సాగుతుందని తెలిపారు. ఈ మూవీ సెప్టెంబర్ 4న జనం ముందుకు రాబోతోంది. త్రీ ఆటమ్‌ లీవ్స్ బ్యానర్‌పై శివ మేక, సాహితి చింతలపూడి నిర్మిస్తున్న ఈ సినిమాకు కృష్ణకుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Apr 20 , 2026 | 01:50 PM