సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అక్టోబర్‌లో సినిమాలన్నీ నిరాశపరిచాయా?

ABN, Publish Date - Nov 01 , 2026 | 11:28 AM

అక్టోబర్ నెలలో 32 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆదర్శ కుటుంబం, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ నిరాశపరిచాయి. జైలర్ 2 మంచి విజయాన్ని అందుకోగా, రణబాలి, కామ్రేడ్ కళ్యాణ్, గరివిడి లక్ష్మీ పాక్షిక విజయాలు సాధించాయి.

October telugu movies

అక్టోబర్‌ నెలలో అత్యధికంగా 32 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఇరవై రెండు స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు కాగా, పది డబ్బింగ్‌ సినిమాలు. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు నిరాశ పర్చగా, చిన్న చిత్రాలు సైతం తమ సత్తాను చాటలేకపోయాయి. దాంతో అక్టోబర్‌ నెల ఎలాంటి మెరుపులూ లేకుండానే మాయమైపోయింది.

అక్టోబర్ ఫస్ట్ వీకెండ్‌లో నాలుగు డబ్బింగ్‌ సినిమాలతో పాటు ఏడు స్ట్రయిట్‌ మూవీస్‌ వచ్చాయి. అందులో చెప్పుకోదగ్గది ఫహద్‌ ఫాజిల్‌ నటించిన 'డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్'. రాజమౌళి సమర్పణలో ఆయన కుమారుడు కార్తికేయ నిర్మాతగా, 'బాహుబలి' నిర్మాత ద్వయం నిర్మించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఏదో మ్యాజిక్‌ జరుగుతుందని తీసిన ఈ మూవీ మౌనంగా థియేటర్ల నుంచి వెళ్ళిపోయింది. అదేవారం వచ్చిన 'అనకాపల్లి, తత్వం, తెల్లకాగితం, రూపాయనమః., సబ్ ఇన్ స్పెక్టర్ యుగంధర్' సినిమాలేవీ తమ ఉనికిని సైతం చాటుకోలేకపోయాయి. తమిళనాడు సీఎం విజయ్‌ తనయుడు జాసన్ సంజయ్‌ రూపొందించిన 'సిగ్మా' కూడా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. సందీప్‌ కిషన్‌ ఖాతాలో మరో పరాజయం జమ అయ్యింది.


అక్టోబర్ సెకండ్‌ వీకెండ్‌లో వచ్చిన ఏడు సినిమాలలో రెండు అనువాద చిత్రాలు. అయితే తమిళ డబ్బింగ్ మూవీ 'సప్తసాగరాలు - సప్తగిరిలు'కు తెలుగులో ఎలాంటి బజ్‌ క్రియేట్‌ కాలేదు. ఇక హిందీలో ఓ ఊపు ఊపిన 'హనుమాన్‌ అంశ్‌'కు తెలుగు ప్రేక్షకులు అస్సలు కనెక్ట్ కాలేదు. స్ట్రయిట్‌ సినిమాల్లో 'కామ్రేడ్‌ కళ్యాణ్‌' మాత్రమే ఓ మేరకు మెప్పించింది. కాస్తంత నవ్వుల పువ్వులు పూయించింది. మేఘాలయాలో షూటింగ్‌ జరుపుకున్న 'బా బా బ్లాక్ షీప్‌', 'చకోర', 'గుడ్‌ టైమ్‌' చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

అక్టోబర్‌ 15న విడుదలైన 'జైలర్‌ -2' చిత్రమే ఈ నెలలో మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు తెలుగులోనూ చక్కని ఆదరణ దక్కింది. ప్రథమార్థంలోని కామెడీ ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించగా, ద్వితీయార్ధంలోని యాక్షన్ యూత్‌ను అట్రాక్ట్ చేసింది. దీనితోనే వచ్చిన 'రణబాలి' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కథాంశం మంచిదే అయినా... దాని ఆసక్తికరంగా తెరకెక్కించడంతో దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్ నూరుశాతం మార్కులు పొందలేకపోయాడు. అలానే ఆ వీకెండ్‌లో జనం ముందుకొచ్చిన 'గరివిడి లక్ష్మీ' బయోపిక్ కు విమర్శకుల ప్రశంసలైతే దక్కాయి. కానీ ఆ స్థాయి కమర్షియల్‌ సక్సెస్ ను ఈ సినిమా పొందలేకపోయింది. అయితే నటిగా ఆనందికి మంచి మార్కులు పడ్డాయి. కొన్నేళ్ళుగా అజ్ఞాతంలో ఉండిపోయిన జానపద కళాకారిణి గరివిడి లక్ష్మీ మీద ఈ సినిమా కారణంగా వెలుగు ప్రసరించింది.


అక్టోబర్‌ నాలుగో వారాంతంలో కూడా రెండు డబ్బింగ్‌, మూడు స్ట్రయిట్‌ సినిమాలు వచ్చాయి. తమిళ అనువాద చిత్రం 'హైకూ', కన్నడ డబ్బింగ్‌ సినిమా '418' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆ వారమే వచ్చిన 'జయహో రామానుజ, ప్రేమ డైరీలో చివరి పేజీలు, 321' చిత్రాలు విడుదల అయ్యాయి... అంతే!

అక్టోబర్‌ మాసం చివరి వారంలో విడుదలైన 'ఆదర్శ కుటుంబం'పై చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. అక్టోబర్ 2న రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడి 30న జనం ముందుకు వచ్చింది. వెంకటేశ్‌, రైటర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి' చిత్రాలను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులను 'ఆదర్శ కుటుంబం' నిరాశకు గురిచేసింది. దర్శకుడిగా, రచయితగా త్రివిక్రమ్ తన అభిమానులను సైతం మెప్పించేలా ఈ సినిమాను చేయలేకపోయారు. 'ఆదర్శ కుటుంబం' ఆగమనానికి భయపడి వాయిదా పడిన ఆరుగురు చిత్రాల నిర్మాతలు బహుశా దాని రిజల్ట్ చూసి, తమ సినిమాను విడుదల చేసి ఉంటే బాగుండేదని భావించి ఉండొచ్చు. ఇక ఇదే వారంలో వచ్చిన జ్యోతి పూర్వజ్‌ 'కిల్లర్', విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'కల్ట్' చిత్రమూ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ రకంగా 'జైలర్‌ 2' చిత్రం చక్కని ఆదరణ పొందగా, 'కామ్రేడ్‌ కళ్యాణ్‌, రణబాలి, గరివిడి లక్ష్మీ' పాక్షిక విజయాన్ని అక్టోబర్‌ నెలలో సొంతం చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

రావణుడి పాత్ర.. కొడుకు వేసిన ప్రశ్నకి ఆశ్చర్యపోయిన యశ్

‘ఆద‌ర్శ కుటుంబం’లో ఆ పాటని పక్కన పెట్టేయడానికి కారణమిదేనా?

ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. రంగంలోకి మరో మ్యూజిక్ డైరెక్టర్?

Updated Date - Nov 01 , 2026 | 11:33 AM