ఎన్టీఆర్- నీల్ సినిమా! డార్క్ థీమ్‌కు గుడ్‌బై.. విమానంలో భారీ యాక్షన్ సీక్వెన్స్!
ABN, Publish Date - Mar 31 , 2026 | 06:21 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన అప్ డేట్ హల్ చల్ చేస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయికలో రూపొందుతున్న చిత్రం డ్రాగన్ (Dragon). మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తోంది. కన్నడ నటి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రకటించిన రోజు నుండే సినీ వర్గాల్లో ఒక రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు, ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలవుతుందని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన అప్ డేట్ హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా సినిమాలోని ఇంటర్వెల్ ఫైట్ గురించి నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో ఎగురుతున్న విమానంలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ ఫైట్ సీన్ విజువల్స్ పరంగా చాలా గ్రాండ్‌గా ఉండటమే కాకుండా, సినిమాలోని ప్రధాన మలుపుకు ఇది కీలకంగా మారుతుందని తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ మొత్తం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్.
సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో డార్క్ థీమ్, బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కానీ 'డ్రాగన్' విషయంలో ఆయన తన రూటు మార్చినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా పూర్తి కలర్ ఫుల్‌గా ఉండబోతోందని సమాచారం. గత చిత్రాల్లో కనిపించిన బ్లాక్ షేడ్ ఫ్రేమ్స్ ఈ సినిమాలో ఎక్కడా కనిపించవట. ఎన్టీఆర్ ను ఒక సరికొత్త కోణంలో చూపించేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు. ఈ మార్పు సినిమాకు ఒక కొత్త లుక్ తీసుకురావడంతో పాటు ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా మారనుంది.
పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఒక మైలురాయిలా నిలిచేలా తీర్చిదిద్దాలని ప్రశాంత్ నీల్ కంకణం కట్టుకున్నారట. సినిమాలో యాక్షన్ పార్ట్ అత్యంత అద్భుతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నారు. 'కేజీఎఫ్', 'సలార్' వంటి చిత్రాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రవి బస్రూర్, ఈ సినిమాను కూడా మరో లెవల్ కు తీసుకెళ్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పాన్-ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర సినిమా కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మార్క్ యాక్షన్, ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ కలగలిసి ఈ సినిమా వెండితెరపై ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.