ఆసుపత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్.. హెల్త్ బులిటెన్ విడుదల
ABN, Publish Date - Aug 13 , 2026 | 04:36 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవలే ఆయన భుజానికి గాయం కాగా, బుధవారం కిమ్స్ ఆసుపత్రిలో ఆర్థ్రోస్కోపిక్ షోల్డర్ సర్జరీ పూర్తయిన సంగతి తెలిసిందే.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR) సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవలే ఆయన భుజానికి గాయం కాగా, బుధవారం కిమ్స్ ఆసుపత్రిలో ఆర్థ్రోస్కోపిక్ షోల్డర్ సర్జరీ (Arthroscopic Shoulder Surgery) పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ శస్త్రచికిత్స విజయవంతం కావడం, ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో.. గురువారం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు కిమ్స్ యాజమాన్యం అధికారికంగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి లీడ్ చేసిన వైద్యుల బృందం ఎన్టీఆర్‌కు ఈ సర్జరీని సమర్థవంతంగా నిర్వహించింది. ఎన్టీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ భాస్కర్ రావు ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం చాలా బాగుందని, వైద్యుల పర్యవేక్షణలోనే పూర్తిస్థాయి రికవరీ కోసం ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ (Structured Rehabilitation Program) ప్రారంభించనున్నారని మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు పేర్కొన్నారు. ఎన్టీఆర్ సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు ఎన్టీఆర్‌కు జరిగిన ఈ సర్జరీ కారణంగా ఆయన నటిస్తోన్న ‘డ్రాగన్’ చిత్ర షూట్‌కు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. అంతేకాదు, ఎన్టీఆర్ కోలుకుని మళ్లీ షూట్‌లోకి వచ్చే వరకు దర్శకుడు ప్రశాంత్ నీల్.. మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్ 2’పై దృష్టి పెట్టనున్నట్లుగా కూడా టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ సర్జరీ పూర్తి చేసుకుని, డిశ్చార్జ్ అవడంతో.. త్వరలోనే ఆయన మళ్లీ నార్మల్‌గా షూట్‌లో పాల్గొంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇవి చదవండి:
కృష్ణ కొడుకుతో సినిమా తీసినా.. ఎన్టీఆర్‌ని ఏమైనా అంటే నేనే కొడతా: MS రాజు
బాక్సాఫీస్ పోరులో ‘సాహో’ జోడీ.. విన్నర్ ఎవరు?
రౌడీ వేర్ బ్రాండ్‌కు ఫ్యాన్స్‌గా డైరెక్టర్స్.. విజయ్ క్రేజ్ ఇది!