NTR Trust: అస్సాం కోసం ముందుకొచ్చిన ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్
ABN, Publish Date - Aug 03 , 2026 | 01:22 PM
అస్సాం వరద బాధితులకు అండగా నిలిచేందుకు నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ (NTR Trust) ముందుకొచ్చింది.
అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు (Assam floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ప్రకృతి విపత్తుతో రాష్ట్రంలోని పలు జిల్లాలు జలమయమవగా, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా ఇప్పటివరకు 75 మంది మృతి చెందగా, ఏడు జిల్లాల్లో వేలాది కుటుంబాలు ఆహారం, తాగునీరు, మందులు వంటి కనీస అవసరాలు కూడా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్లిష్ట సమయంలో అస్సాం వరద బాధితులకు అండగా నిలిచేందుకు నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ (NTR Trust) ముందుకొచ్చింది. బాధితులకు బట్టలు, దుప్పట్లు, చెప్పులు, డ్రై ఫుడ్స్, బియ్యం, తాగునీరు, సానిటరీ కిట్లు తదితర నిత్యావసర వస్తువులను అందించేందుకు ప్రత్యేక సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ వంతు సహాయాన్ని అందించాలని ట్రస్ట్ పిలుపునిచ్చింది.
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ జేఎన్‌టీయూ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సహాయ సామగ్రి సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహన రూప, తుమ్మల ప్రసన్న కుమార్, ఎన్‌బీకే ఫ్యాన్స్ అనంతపురం జగన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే బాలయ్య యువసేనకు చెందిన అట్లూరి దీపక్, సత్తార్, చెరుకూరి రవి, మార్ని పవన్ తదితరులు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సహాయ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా నందమూరి మోహన రూప మాట్లాడుతూ 'ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉంది. అభిమానులు, ప్రజలు తమకు చేతనైన సహాయంతో ముందుకు వచ్చి అస్సాం వరద బాధితులకు భరోసా ఇవ్వాలని కోరుతున్నాం' అని అన్నారు.