Rana: హీరో కాదు.. దర్శకుడే ఇప్పుడు స్టార్ బ్రాండ్!
ABN, Publish Date - Sep 02 , 2026 | 12:40 PM
భారతీయ సినీ పరిశ్రమలో ప్రేక్షకుల అభిరుచులు గణనీయంగా మారుతున్నాయని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి పేర్కొన్నారు.
భారతీయ సినీ పరిశ్రమలో ప్రేక్షకుల అభిరుచులు గణనీయంగా మారుతున్నాయని ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి (Rana Daggubati) పేర్కొన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల ఇమేజ్‌ను బట్టి సినిమాలు ఎంచుకునే ప్రేక్షకులు, ఇప్పుడు దర్శకుడి పేరు చూసి థియేటర్లకు వెళ్లే స్థాయికి చేరుకున్నారని అన్నారు.
తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన రానా.. నేటి ప్రేక్షకులు కేవలం హీరోల అభిమానులుగా కాకుండా, మంచి కథలు చెప్పే దర్శకుల అభిమానులుగా మారుతున్నారని చెప్పారు. రాజమౌళి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి దర్శకుల సినిమాల కోసం ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు.
ప్రస్తుతం సినిమా విజయంలో హీరోతో పాటు దర్శకుడి విజన్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని రానా అభిప్రాయపడ్డారు. ఒక దర్శకుడి గత చిత్రాల కంటెంట్‌ను నమ్మి ప్రేక్షకులు కొత్త సినిమాలకు వెళ్లడం పెరిగిందన్నారు.
అందుకే దర్శకుల పేర్లు ఇప్పుడు బ్రాండ్‌లుగా మారుతున్నాయని చెప్పారు. పాన్ ఇండియా సినిమాల విజయాలు కూడా ఈ మార్పుకు ప్రధాన కారణమని అన్నారు. భాషల సరిహద్దులను దాటి ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కొత్త కథలు, ప్రత్యేకమైన మేకింగ్ అవసరమనే అవగాహన పెరిగిందని చెప్పారు.