సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మాలీవుడ్‌కి నార్త్‌ ఈస్ట్‌ సినిమా పెద్ద పోటీ

ABN, Publish Date - Feb 28 , 2026 | 05:17 PM

ఇండియాలో అవార్డుల విషయంలో మలయాళ చిత్ర పరిశ్రమ (mollywood) ఆధిపత్యం ఉన్నా.. ఇప్పుడు ఈశాన్య భారత సినిమాలు అంతర్జాతీయ వేదికలపై సంచలనం సృష్టిస్తున్నాయి


ఇండియాలో అవార్డుల విషయంలో మలయాళ చిత్ర పరిశ్రమ (mollywood) ఆధిపత్యం ఉన్నా.. ఇప్పుడు ఈశాన్య భారత సినిమాలు అంతర్జాతీయ వేదికలపై సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల ‘బూంగ్‌’ (boong)అనే మణిపురి చిత్రం పలు అంతర్జాతీయ వేదికలపై పురస్కారాలు అందుకుని, ప్రతిష్ఠాత్మక బాప్టా-2026 తన ఖాతాలో వేయడంతో దీనిపై విస్తృత చర్చ నడుస్తోంది. భారతదేశంలో అవారులు సాధించడంతో మాలీవుడ్‌ నుంచి ఎప్పుడూ మంచి చిత్రాలే వస్తాయని ప్రశంసించే వారికి ఈశాన్య భారత చిత్రాలు గురించి తెలుసు కోవలసిన అవసరం ఉంది. గతంలో కేవలం మలయాళ చిత్రాలకే పరిమితమైన జాతీయ, అంతర్జాతీయ అవార్డుల రేసులోకి ఇప్పుడు ఈశాన్య భారత్‌ నుంచి అస్సామీల, మణిపురి చిత్రాలు బలంగా దూసుకొస్తున్నాయి. మణిపురి చిత్రం ‘బూంగ్‌’ ఇటీవల టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేదికపై ప్రశంశలు అందుకుని నార్త్‌ చిత్రాల సత్తా చాటింది. కొత్త కథలు మాత్రమే కాకుండా, సాంకేతిక విలువలు  మేకింగ్‌ స్టైల్‌ వల్లే ఈ సినిమా?ని అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాయి.

అయితే ఇప్పటికీ ఇండియాలో రియలిస్టిక్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ మాలీవుడ్‌.  దీని తర్వాతే మిగిలిన వారు అన్నది నిజమే. మలయాళ చిత్రాలు సహజత్వానికి, సమాజంలోని లోతులకు అద్దం పడతాయి. అందుకే జాతీయ అవార్డుల్లో మాలీవుడ్‌ వాటా ఎక్కువగా ఉంటుంది. మాలీవుడ్‌లో బడ్జెట్లు ఎప్పుడూ లిమిట్‌లో ఉంటుంది. గీత దాటకుండా అక్కడి చిత్రాలను తెరకెక్కిస్తారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల సినిమాలు కూడా అత్యంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినా బలమైన భావోద్వేగాల వల్ల అంతర్జాతీయ సినీ ప్రియులను అలరిస్తున్నాయి.  సినిమాకు అవసరం లేని కమర్షియల్‌ హంగులు లేకుండా.. నేల విడిచి సాము చేయకుండా కథను చెప్పడం మాలీవుడ్‌తోపాటు నార్త్‌-ఈస్ట్‌ సినిమాల బలం. గతంలో కేవలం కమర్షియల్‌ చిత్రాలకే పరిమితమైన టాలీవుడ్‌ ఇటీవలే బలగం, కేరాఫ్‌ కంచరపాలెం, ఓ బేబి, పుష్ప వంటి చిత్రాలతో అవార్డుల కంటెంట్‌ వైపు అడుగులు వేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం అస్సామీ చిత్రాలే కాకుండా మణిపురి, మేఘాలయా చిత్రాలు కూడా కేన్స్‌, బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ వైపు చూస్తున్నాయి. మారుమూల గ్రామాల్లోని సమస్యలను కూడా ప్రపంచానికి అర్థమయ్యేలా తీయడం ఈ చిత్రాల ప్రత్యేకత. మలయాళంలాగే.. ఈశాన్య రాష్ట్రాల సినిమాలు కూడా వారి సంస్కృతిని, సంప్రదాయాలను సినిమాల్లో జీవం ఉట్టిపడేలా చూపిస్తున్నాయి. కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు తీయడంలో మలయాళనాట ఎక్కువ. ఇప్పుడు అదే దారిలో నార్త్‌ ఈస్ట్‌ మేకర్స్‌ కూడా పయనిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో జాతీయ అవార్డులలో 30-40శాతం మలయాళం, మరాఠీ చిత్రాలే ఆక్రమించాయి. కేరళ ప్రభుత్వంలాగే.. ఇప్పుడు అస్సాం, మణిపూర్‌ ప్రభుత్వాలు కూడా చిత్ర నిర్మాణానికి రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తుండంతో నార్త్‌ ఈస్ట్‌ అవార్డుల్లోను వెలుగొందుతుంది. మలయాళ చిత్రాలకు ఇప్పుడు నార్త్‌ ఈస్ట్‌ పెద్ద పోటీగా మారింది. 

Updated Date - Feb 28 , 2026 | 06:30 PM