Rahul gowlikar: ఐడీల జారీలో జాప్యం లేదు.. సెన్సార్ సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తాం!
ABN, Publish Date - Nov 12 , 2026 | 09:37 AM
సినీ బ్యానర్లకు జారీ చేసే ఐడీల విషయంలో జాప్యం జరగటం లేదని.. అవసరమైన పత్రాలన్నీ సక్రమంగా ఉంటే ఐడీలు జారీ చేస్తున్నామని సెన్సార్ బోర్డు తాత్కాలిక ప్రాంతీయ అధికారి రాహుల్ గోలేకర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
సినీ బ్యానర్లకు జారీ చేసే ఐడీల విషయంలో జాప్యం జరగటం లేదని.. అవసరమైన పత్రాలన్నీ సక్రమంగా ఉంటే ఐడీలు జారీ చేస్తున్నామని సెన్సార్ బోర్డు (Censor board) తాత్కాలిక ప్రాంతీయ అధికారి రాహుల్ గోలేకర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఏవైనా పత్రాలు సరిగ్గా లేకపోతేనే ఐడీల జారీలో జాప్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ‘సినీ నిర్మాతలకు ఐడీ చిక్కులు’ శీర్షికతో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై రాహుల్ స్పందించారు. సక్రమంగా ఉన్న దరఖాస్తులను ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఫొటోలు అస్పష్టంగా ఉంటే వాటిని తిరిగి అప్లోడ్ చేయాల్సిందిగా సూచిస్తున్నామని.. తమ వద్ద దరఖాస్తుల సగటు ప్రాసెసింగ్ సమయం వారం రోజులని ఆయన వివరించారు. తాము నిర్మాతలకు, వారి ప్రతినిధులకు ఆఫీసులో అందుబాటులో ఉంటామని.. ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని తనను వారు కలవవచ్చని వెల్లడించారు.
లేఖ రాస్తాం..
సెన్సార్ బోర్డు ద్వారా తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరిస్తూ తాము త్వరలోనే ప్రభుత్వానికి ఒక లేఖ రాయబోతున్నట్లు తెలుగు ఫిల్మ్ చాంబర్ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ సెన్సార్ కార్యాలయానికి ఒక శాశ్వత రీజినల్ ఆఫీసర్ అవసరమనే విషయాన్ని తాము కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు చైర్మన్ వెంపటి శశి దృష్టికి తీసుకువచ్చామని.. ఆయన సానుకూలంగా స్పందించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో తాము కొందరు పార్లమెంట్ సభ్యులను కూడా సంప్రదించామని.. వారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా తమ సమస్యలను తెలియజేస్తామని వివరించాయి.