తగ్గని చిన్న సినిమాల సందడి!
ABN, Publish Date - Mar 03 , 2026 | 10:13 AM
రాబోయే శుక్రవారం ఏకంగా తొమ్మిది చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ప్రభాస్ నటించిన 'మున్నా' చిత్రమూ మార్చి 6న రీ-రిలీజ్ అవుతోంది. ఈవారం రిలీజ్ లలో రెండు డబ్బింగ్ సినిమాలూ ఉన్నాయి.
మార్చి మొదటి శుక్రవారంలోనూ దాదాపు పది చిత్రాలు ప్రేక్షకులకు ముందుకు రావడానికి సిద్థమయ్యాయి. అయితే లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నటించిన 'సతీ లీలావతి' (Sathi Leelavathi) సినిమా విడుదల వాయిదా పడటంతో ఇప్పుడు రీ-రిలీజ్ అవుతున్న 'మున్నా' (Munna) తో కలిసి తొమ్మిది సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సీనియర్ నటుడు శివాజీ (Shivaji) హీరోగా నటించి, నిర్మించిన 'సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని'. శివాజీ, లయ (Laya) జంటగా నటించిన ఈ క్రైమ్ కామెడీ మూవీతో సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sharath Kumar) నిర్మాతగా, దర్శకురాలిగా మారి రూపొందించిన 'సరస్వతి' (Saraswathi) మూవీ సైతం ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమాకు ఆమె సోదరి పూజా కుమార్ మరో నిర్మాత. ప్రియమణి (Priyamani), ప్రకాశ్‌రాజ్ (Prakash Raj), కిశోర్, సప్తగిరి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ క్రైమ్ డ్రామా మీద కూడా బాగానే బజ్ క్రియేట్ అయ్యింది. గత వారం 'విష్ణు విన్యాసం' (Vishnu Vinyasam) తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీవిష్ణు (Srivishnu) ఈ వారం 'మృత్యుంజయ్' (Mruthunjai) మూవీతో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. గతంలో శ్రీవిష్ణు సరసన 'సామజవర గమన'లో నాయికగా నటించిన రెబా మోనికా జాన్ ఇందులో కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ డైరెక్టర్. 'సరస్వతి' తరహాలో ఇది కూడా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీనే.
వీటితో పాటుగా శ్రీనాథ్ మాగంటి (Srinath Maganti) హీరోగా నటించిన 'మెన్షన్ హౌస్ మల్లేష్' మూవీ సైతం శుక్రవారం విడుదల అవుతోంది. రాజేశ్ నిర్మించిన ఈ సినిమాను బాల సతీశ్ తెరకెక్కిస్తున్నాడు. గాయత్రి రమణ హీరోయిన్ కాగా సాయి కామాక్షి భాస్కర్ల, రాజేశ్, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం రోజుl 'విధాత', 'చెష్మా రాజా స్వీటీ రాణి' చిత్రాలు సైతం విడుదల కాబోతున్నాయి. ఈ ఆరు స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు హిందీ అనువాద చిత్రం 'మిషన్ సి 1000', తమిళ డబ్బింగ్ సినిమా 'కాన' కూడా మార్చి 6న జనం ముందుకు వస్తున్నాయి. ఇక ప్రభాస్, ఇలియానా జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'మున్నా' సినిమా కూడా శుక్రవారం రీ-రిలీజ్ అవుతోంది. మరి ఈ తొమ్మిది సినిమాలలో ఏ యే సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి.