సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నిమ్మకాయ.. భయమెందుకు?

ABN, Publish Date - Jul 01 , 2026 | 07:23 PM

ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది.

ఆధునిక కాలంలోనూ మూడ నమ్మకాలను నమ్మే వారిని ఎండగడుతూ తెర‌కెక్కుతున్న‌ 'నిమ్మకాయ. నీకెందుకు భయం' చిత్రం షూటింగ్ బుధవారం సారథి స్టూడియోలో ప్రారంభమైంది. రాజేశ్ భూపతి, స్వప్నరాజ్, అభిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకుడు.

హైదరాబాద్‌లోని అమీర్‌పేట సారథి స్టూడియోస్‌లో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లాప్ కొట్టగా, లయన్ వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌కు టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ, హారర్, థ్రిల్లర్ అంశాలతో కూడిన ఈ కథ తనను బాగా ఆకట్టుకుందని, ఆమని గారితో కలసి నటించడం ఆనందంగా ఉంది' అని అన్నారు. చిన్న నిర్మాతలను ప్రభుత్వం ప్రోత్సహించేలా ప్రత్యేక సబ్సిడీలు, పథకాలు తీసుకురావాలని కోరారు. చిన్న సినిమాలు విజయవంతమైతేనే సినీ పరిశ్రమలో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

దర్శకుడు రోశిరెడ్డి పందిళ్లపల్లి మాట్లాడుతూ, ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. నిమ్మకాయ చుట్టూ ప్రచారంలో ఉన్న అపోహలను కథాంశంగా తీసుకుని వినోదాత్మకంగా, ఆలోచింపజేసే విధంగా సినిమాను తెరకెక్కిస్తున్నామని చెప్పారు. కథలో ఎక్కువ భాగం నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఉంటుందని వెల్లడించారు.

హీరో రాజేష్ భూపతి మాట్లాడుతూ, ఇది తన తొలి సినిమా అని, నిమ్మకాయకు సంబంధించిన మూఢనమ్మకాల వెనుక ఉన్న వాస్తవాలను కొత్త కోణంలో చూపించే ప్రయత్నమే ఈ చిత్రమని అన్నారు. దర్శక నిర్మాతలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక‌.. విభిన్నమైన టైటిల్‌తో ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న 'నిమ్మకాయ.. నీకెందుకు భయం' చిత్రం ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

Updated Date - Jul 02 , 2026 | 08:02 AM