Megaverse: నెట్‌ఫ్లిక్స్.. జర సర్వర్లు జాగ్రత్తగా పెట్టుకోమ్మా! బాస్.. ప్రభాస్ బ్లాస్టింగ్‌కు రెడీ
ABN, Publish Date - Nov 15 , 2026 | 01:32 PM
మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నెట్‌ఫ్లిక్స్ మెగావర్స్ టాక్ షోలో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా పాల్గొనబోతున్నారనే వార్త టాలీవుడ్లో ఆసక్తి రేపుతోంది.
బిగ్ స్క్రీన్ అయినా, స్మాల్ స్క్రీన్ అయినా.. రికార్డులను తిరగరాయడం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి వెన్నతో పెట్టిన విద్య. ఒకవైపు వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న చిరంజీవి, ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో మెగావర్స్ (Megaverse) టాక్ షో ద్వారా తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్ను అందించడానికి ప్లాన్ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి కీలక ఎపిసోడ్ల షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే, ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ క్రేజ్ ఉన్న ఓ కాంబినేషన్ ఈ షోలో మెగాస్టార్‌తో కలిసి సందడి చేయబోతోంది!
ఆ కాంబినేషన్ మరెవరో కాదు.. చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం చూపించే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), బాక్సాఫీస్ రారాజు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). అవును, ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్న స్పిరిట్ సినిమా కాంబో చిరంజీవి టాక్ షోలో మెరవబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. ఇండియన్ సినిమాలో బోల్డ్ అండ్ రా మేకింగ్‌తో సంచలనం సృష్టించిన సందీప్, పాన్ ఇండియా రేంజ్లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉన్న ప్రభాస్.. ఈ ఇద్దరూ కలిసి చిరంజీవి సరసన ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ హైప్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇప్పటికే పలువురు స్టార్స్ ఈ షోలో పాల్గొన్నప్పటికీ, ప్రభాస్-సందీప్ కాంబో గురించిన బజ్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గతంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన అన్‌స్టాపబుల్ షో గుర్తుండే ఉంటుంది. ఆ షోకి ప్రభాస్ గెస్ట్‌గా వచ్చినప్పుడు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు వచ్చిన ట్రాఫిక్ వల్ల సర్వర్లు కొద్ది గంటల పాటు నిలిచిపోయాయనే వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూశాం. ప్రభాస్ కనిపిస్తే చాలు.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ సైతం షేక్ అయిపోతాయనడానికి ఆ ఘటనే నిదర్శనం. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా, సందీప్ రెడ్డి వంగా తోడుగా ప్రభాస్ వస్తున్నారంటే.. నెట్‌ఫ్లిక్స్ (Netflix) సర్వర్లకు కూడా గట్టి పరీక్ష తప్పేలా లేదు. రికార్డు వ్యూయర్షిప్తో ఓటీటీ స్క్రీన్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కనున్న స్పిరిట్ చిత్రం శరవేగంగా సన్నాహాలు జరుపుకుంటోంది. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోయే ఈ చిత్రంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవితో జరిగే చిట్‌చాట్‌లో స్పిరిట్ గురించిన కొన్ని క్రేజీ సీక్రెట్స్, ప్రభాస్ పర్సనల్ విశేషాలు, అలాగే చిరంజీవిపై సందీప్‌కు ఉన్న అభిమానం వంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మూడు విభిన్న శైలుల సినీ దిగ్గజాలు ఒకే వేదికపై కూర్చుని మనసు విప్పి మాట్లాడితే అంతకంటే వినోదం ఇంకేముంటుంది. ప్రస్తుతానికైతే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కానీ, ఈ క్రేజీ ఎపిసోడ్ నిజమైతే మాత్రం నెట్‌ఫ్లిక్స్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ వ్యూయర్షిప్ రికార్డు కావడం పక్కా.