Naveen Polishetty: నవీన్ పొలిశెట్టి.. రేర్ ఫీట్! బాలయ్య, వెంకీ తర్వాత ఆ మూడింటిలో
ABN, Publish Date - Jan 18 , 2026 | 06:49 AM
తెలుగు సినీ పరిశ్రమలో ఒక పాత్ర ప్రేక్షకులకు చేరువవ్వాలంటే కేవలం నటన ఉంటే సరిపోదు.
తెలుగు సినీ పరిశ్రమలో ఒక పాత్ర ప్రేక్షకులకు చేరువవ్వాలంటే కేవలం నటన ఉంటే సరిపోదు, ఆ పాత్ర తాలూకు 'యాస' మీద పట్టు ఉండాలి. అప్పుడే ఆ క్యారెక్టర్‌కు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. మన టాలీవుడ్‌లో ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ యాసలను పలకడంలో దిగ్గజ హీరోలే అప్పుడప్పుడు తడబడతారు. కానీ, అతి తక్కువ సమయంలోనే ఈ మూడు ప్రాంతాల యాసలపై పట్టు సాధించి, హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ఏకైక యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty).
మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ కెరీర్‌లో కొన్ని సినిమాల్లో ఒకటి రెండు సన్నివేశాల్లో భిన్నమైన స్లాంగ్‌లను వాడి అలరించారు. కానీ, పూర్తి స్థాయిలో ఒక్కో యాస కోసం ఒక్కో సినిమా చేసిన సందర్భాలు తక్కువ. అయితే, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ లాంటి హీరోలు మాత్రం మూడు ప్రాంతాల యాసలతో సినిమాలు చేసి ప్రేక్షకులను ఔరా అనిపించారు. సీమ యాసలో బాలయ్య గర్జన, ఆంధ్రా స్లాంగ్‌లో వెంకటేష్ గోదావరి మేనరిజమ్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే.
ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ, అరుదైన ఫీట్‌ను సాధించి అందరి చేత 'శభాష్' అనిపించుకుంటు న్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. యంగ్ హీరోలలో చాలా మంది భిన్నమైన స్లాంగ్స్ ట్రై చేస్తున్నా, నవీన్ పొలిశెట్టి మాత్రం మూడు విభిన్న యాసలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి 'మిస్టర్ పర్‌ఫెక్ట్' అనిపించుకున్నాడు. తొలి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతోనే నెల్లూరు స్లాంగ్‌లో సాగే డిటెక్టివ్ పాత్రలో నవీన్ ప్రాణం పోశాడు. ఆ యాసలోని సహజత్వం సినిమాను సూపర్ హిట్ చేసింది.
ఈ సినిమా తర్వాత వచ్చిన జాతిరత్నాలుతో నవీన్ రేంజ్ మారిపోయింది. ఇందులో నవీన్ పొలిశెట్టి జోగీపేట్ శ్రీకాంత్ అనే తెలంగాణ యువకుడిగా నటించాడు. ఇందులో పక్కా తెలంగాణ స్లాంగ్‌లో నవీన్ చెప్పిన డైలాగ్‌లు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. తెలంగాణ స్లాంగ్‌తోనూ జాతిరత్నాలుతో బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సంక్రాంతికి నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) చిత్రంతో గోదావరి యాసను పట్టుకున్నాడు. జనవరి 14న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 61 కోట్లు వసూలు చేసి అప్రతిహతంగా కొనసాగుతోంది.
పెద్ద పెద్ద స్టార్లకే పరిమితమైన ఈ 'యాసల మ్యాజిక్'ను నవీన్ పొలిశెట్టి అలవోకగా ప్రదర్శిస్తున్నాడు. ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఒకేసారి మూడు స్లాంగ్‌లను మార్చి మార్చి మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. సీనియర్ హీరోల తరహాలోనే మూడు భిన్నమైన ప్రాంతాల యాసలతో వరుసగా మూడు విజయాలు అందుకోవడం నవీన్ సాధించిన రేర్ ఫీట్ అని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు నవీన్‌ను "మిస్టర్ పర్‌ఫెక్ట్" అని పిలుస్తున్నాయి.