బాలయ్యకు సర్జరీ.. నారా బ్రహ్మణి ఏం చెప్పారంటే
ABN, Publish Date - Jul 25 , 2026 | 01:59 PM
తండ్రి నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఆందోళనలను తొలగిస్తూ ఆయన కుమార్తె నారా బ్రహ్మణి సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చారు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘NBK 111’. బ్లాక్‌బస్టర్ హిట్ ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో, మొదటి నుంచీ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాజమండ్రిలో శరవేగంగా జరుగుతున్న షూటింగ్‌లో భాగంగా ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తుండగా.. బాలకృష్ణ మోకాలికి స్వల్ప గాయమైన విషయం తెలిసిందే. దీంతో వెంటనే అప్రమత్తమైన చిత్రబృందం షూటింగ్‌ను నిలిపివేసి, మెరుగైన వైద్యం కోసం ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే, బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఆందోళనలను తొలగిస్తూ ఆయన కుమార్తె నారా బ్రహ్మణి (Nara Brahmani) సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చారు. బాలయ్య మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు తెలిపారు. ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా సర్జరీ ముగిసిందని, ఆయన ఎప్పటిలాగే ఎనర్జిటిక్‌గా ఉన్నారని వెల్లడించారు. తమ తండ్రి కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మణి ఇచ్చిన ఈ అప్‌డేట్‌తో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్యుల సలహా మేరకు బాలకృష్ణ కొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన మళ్లీ ‘NBK 111’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఆయన ఆగస్ట్ చివరి వారం వరకు షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనివల్ల ముందుగా అనుకున్న డిసెంబర్ విడుదల తేదీపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ సినిమా డిసెంబర్ రేసు నుండి తప్పుకుంటే, 2027 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరోవైపు, డిసెంబర్ బాక్సాఫీస్ బరి చాలా ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫౌజీ’ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అలాగే విజయ్ దేవరకొండ - కీర్తి సురేష్ జోడీగా రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ‘రౌడీ జనార్ధన’ చిత్రం కూడా డిసెంబర్ రేసులోనే ఉంది. అయితే, ఈ సినిమాల షూటింగ్ పురోగతిపై స్పష్టత లేకపోవడంతో డిసెంబర్ బాక్సాఫీస్ పై అనిశ్చితి కొనసాగుతోంది. బాలయ్య పూర్తిగా కోలుకుని సెట్స్‌కి తిరిగొచ్చాక మాత్రమే ‘NBK 111’ విడుదల తేదీపై స్పష్టత రానుంది. కారణం ఏదైనా.. బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో మోత మోగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!. సినిమా ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
రామా ఏంటిది.. ప్రమోషన్స్ కోసమే రూ. 375 కోట్లా?
బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం
ప్రముఖ డైరెక్టర్ మృతి.. విషాదంలో ఇండస్ట్రీ