AP Nandi Awards: నంది అవార్డులపై కొత్త జీవో.. మొదలైన కొత్త సందేహాలు
ABN, Publish Date - Sep 22 , 2026 | 05:25 PM
తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించే అవార్డులేవంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేసే 'నంది అవార్డులు' అనే చెప్పాలి.
తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించే అవార్డులేవంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేసే 'నంది అవార్డులు' (AP Nandi Awards) అనే చెప్పాలి. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017లో నంది అవార్డ్స్ ను పునఃప్రతిష్ఠించింది. అంతకు ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 2011 వరకు నంది అవార్డుల ప్రదానం జరిగింది. దాంతో 2012 నుండి 2016 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం 'నంది అవార్డుల ఎంపిక' సాగించింది. అప్పట్లో ఈ ఐదేళ్ళ నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని రెండు రోజుల పాటు నిర్వహిస్తామనీ ప్రకటించారు. అందుకు వేదికగా బాపట్ల సమీపంలోని సూర్యలంకనూ ఎంచుకున్నట్టు తెలిపారు. అయితే నంది అవార్డుల ప్రదానోత్సవం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఆ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడీ జరిగింది. దీంతో 2019 నుండి 2024 వరకు అప్పటి ప్రభుత్వం అసలు నంది అవార్డుల ఊసే ఎత్తుకోలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆంధ్రప్రదేశ్ లోని యన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం నంది అవార్డులను పునఃప్రతిష్ఠ చేయసంకల్పించింది. ఈ విషయాన్ని మంగళవారం ఎ.పి.ఎస్.ఎఫ్.టి.వి.టి.డి.సి. ఛైర్మన్ భరత్ భూషణ్, ఎమ్.డి. కె.యస్. విశ్వనాథన్ మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన జీ.వో.ను చూడగానే ఎవరికైనా పలు అనుమానాలు తలెత్తక మానవు. ఎందుకంటే అంతకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే ప్రకటించిన 2012- 2016 అవార్డులతో పాటు 2017 నుండి 2025 వరకు నంది అవార్డులను కూడా ఎంపిక చేసి అన్నిటినీ ఒకే వేదికపై ప్రదానం చేయనున్నట్టు అందులో ఉంది. అంటే మొత్తం 14 సంవత్సరాల అవార్డులు ఒకే వేదికపై 'ఎన్ని రోజులు' ప్రదానం చేస్తారో అర్థం కావడం లేదు. ఇవన్నీ ఇవ్వాలంటే 48 గంటల నుండి 72 గంటలు పట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఈ విషయంలో ఏమైనా కొత్త రికార్డు సృష్టిస్తారేమో అనీ జనం నవ్వుకుంటున్నారు. ఇక 2017 నుండి 2024 వరకు నంది అవార్డుల్లో కేవలం రెండు ఉత్తమ చిత్రాలకు, రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించడమూ విడ్డూరంగా ఉంది. మూడు ఉత్తమ చిత్రాలకు నంది అవార్డులు (స్వర్ణ, రజత, కాంస్య) ఇవ్వాలన్న సంప్రదాయంతోనే 'నంది అవార్డులు' ఆవిర్భవించాయి. ఇప్పుడు మూడో ఉత్తమ చిత్రాన్ని ఎందుకు మరచిపోయారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదే సంప్రదాయాన్ని చూసే కదా తెలంగాణ ప్రభుత్వం సైతం 'మూడు ఉత్తమ చిత్రాల'ను ఎంపిక చేసింది. అలాంప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరిస్తే ఎలా?
అవార్డుల ఎంపిక విధానాలు/ దరఖాస్తుల విషయంలోనూ ఈ జీవోలో స్పష్టత కనిపించడం లేదు. ఎందుకంటే సినిమాలకయితే సెన్సార్ సర్టిఫికెట్ ఆధారంగా ఏ సంవత్సరం ఏ సినిమా రిలీజయిందో గుర్తిస్తారు. మరి టీవీ సీరియల్స్ కు ఏ ప్రాతిపదికన గుర్తిస్తారో తెలియడం లేదు. టీవీ సీరియల్స్ ఏళ్ళకు ఏళ్ళు సాగుతూ ఉంటాయి. అందువల్ల ప్రస్తుతం ప్రసారమవుతున్న ధారావాహికలకు అవార్డులు ఇస్తే సరిపోతుంది కదా అని పరిశీలకులు అంటున్నారు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రఘుపతి వెంకయ్య, బి.యన్.రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులతో పాటు యన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డును కూడా 2012 నుండి 2016 వరకు ప్రకటించారు. ఆ అవార్డులను 2017 నుండి 2024 వరకు ఎవరినీ ఎంపిక చేయరాదని నిర్ణయించడమూ విడ్డూరంగానే అనిపిస్తోంది. అంటే ఈ ఎనిమిదేళ్ళ కాలంలో తెలుగు చిత్రసీమలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకొనేవారే లేరా అన్న ప్రశ్న తలెత్తక మానదు.
అసలు 2017లో అప్పటి ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించినప్పుడే కొన్ని సినీవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేయడం, తరువాత అదంతా ఓ రాద్దాంతంగా మారడం, ఆపై సమసిపోవడం జరిగాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడకుండా ఇప్పుడు కూడా 'నంది అవార్డుల'పై ఇంత కంగాళీగా నిర్ణయం తీసుకోవడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. నంది అవార్డుల ఎంపిక ప్రక్రియ సాగక ముందే ఇలా ఉంటే అవార్డుల ఎన్నిక ఎలా సాగుతుందో అన్న అనుమానాలను పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా మించి పోయింది లేదు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి జీవో రాగానే వినిపిస్తోన్న విమర్శలకు తగిన దిద్దుబాటుచర్యలు తీసుకుంటుందేమో చూడాలి.