Nagarjuna: సిటీ కోసం.. ఇది కదా చేయాల్సింది అనిపించింది..

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:46 AM

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున హైదరాబాద్‌లోని తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులపై ప్రశంసలు కురిపించారు.

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున (nagarjuna) హైదరాబాద్‌లోని తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులపై ప్రశంసలు కురిపించారు. చెరువును అద్భుతంగా తీర్చిదిద్దారని, దాని రూపురేఖలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌తో (Hydra Ranganath) తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు.

"తమ్మిడికుంట చెరువు విషయంలో మాట్లాడేందుకు రంగనాథ్‌ తొలిసారి కలిసినప్పుడు నా మైండ్లో  ఏదో పెట్టుకుని కలిశాను.  ఆయన ఎంతో ఓపికగా నాతో మాట్లాడి, ప్రతి విషయాన్ని అర్థమయ్యేలా వివరించారు. ఆయన మాటలు విన్న తర్వాత నా ఆలోచన మారింది. వ్యక్తిగత ప్రయోజనాల కంటే మన నగర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అర్థమైంది. మన సిటీ కోసం ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఉందనిపించింది.  ఈ భూమి మీద మనం ఏమి శాశ్వతం కాదు.. ఏదో ఒక  రోజు పోవాల్సిందే. వెళ్తూ డెబిట్ కార్డు కూడా వెంట తీసుకెళ్ళలేము. నేను విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి నగరాల్లో ఉన్న సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం చూసి.. మన హైదరాబాద్‌ కూడా అలా ఎందుకు ఉండకూడదని అనుకునేవాడిని. ఇప్పుడు తమ్మిడికుంట చెరువును చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అభివృద్ధి మన నగరానికి ఎంతో అవసరం. ఈ చెరువు పరిసరాల్లో సినిమా షూటింగ్‌ కూడా చేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చెరువులు, నదులంటే చాలా ఇష్టం. నగరంలోని జలవనరులను పరిరక్షించాలనే సంకల్పంతో ఆయన ఈ పనులు చేస్తున్నారు. మంచి పని చేస్తున్నప్పుడు విమర్శలు, వ్యతిరేకత ఎదురవుతుంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి. చెరువుల పునరుద్ధరణ వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, వర్షాకాలంలో నీరు రోడ్లపైకి చేరి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చు. చెరువుల్లో నీటి నిల్వలు పెరిగితే ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికీ ఉపయోగపడుతుంది'' అని అన్నారు. ఇదే తరహాలో మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం కూడా కొనసాగుతోందని నాగార్జున తెలిపారు.

ALSO READ:
Rahul gowlikar: ఐడీల జారీలో జాప్యం లేదు.. సెన్సార్ సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తాం!

Censor Issue: చివరి నిమిషంలో టైటిల్ మార్చాలా? నిర్మాతలకు కోట్ల నష్టం తప్పదా?

Anil Ravipudi: ఓవర్సీస్‌లో అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. సందడే సందడి..

Jyothika: మా పరిధిని మరింతగా విస్తరించే ధైర్యాన్ని ఇచ్చారు

Updated Date - Nov 12 , 2026 | 12:07 PM