Akkineni: 'మనం' తరహాలో మల్టీస్టారర్!

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:13 PM

అక్కినేని నాగార్జున 'మనం' తరహాలో మల్టీస్టారర్ మూవీని ప్లాన్ చేస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద తెరకెక్కే ఈ సినిమాలో నాగార్జున, ఆయన కొడుకులిద్దరూ హీరోలుగా నటిస్తారని టాక్!

Akkineni Family Movie

అఖిల్ అక్కినేని ఖాతాలో ఎట్టకేలకు 'లెనిన్' పుణ్యమా అని ఓ హిట్‌ ఫిల్మ్ పడింది. అంతేకాదు... ఆ మధ్య నాగచైతన్య 'తండేల్'తో వంద కోట్ల క్లబ్‌లో చేరినట్టుగానే అఖిల్‌ కూడా ఒకటి రెండు రోజుల్లో ఆ క్లబ్‌లో చోటు దక్కించుకోబోతున్నాడు. 'లెనిన్' సినిమాకు రిలీజ్‌ డే డివైడ్ టాక్ వచ్చినా... ప్రేక్షకులు మాత్రం నెగిటివిటీని మనసులోకి తీసుకోకుండా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. యాక్షన్‌ పార్ట్ అధికంగా ఉందనే విమర్శలు వచ్చినా... మురళీకిశోర్ అబ్బూరు టేకింగ్‌ ను ఇష్టపడుతున్నారు. మొత్తం మీద 'లెనిన్' విజయ పథంలో సాగడంతో అఖిల్ కొత్త సినిమాలపై అందరి దృష్టి పడింది.


నిజానికి అఖిల్ ఎప్పటి నుంచో కొన్ని కథలను విని, నచ్చి పక్కన పెట్టుకున్నాడు. అయితే సరైన టైమ్ కోసం వాటిని పట్టాలెక్కించకుండా ఉంచాడు. ఎప్పుడైతే 'లెనిన్‌' మంచి విజయాన్ని సాధించిందో ఇప్పుడు వాటిపై అఖిల్‌ తిరిగి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి యువీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ పీరియాడికల్‌ మూవీ. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాకు 'ధీర' అనే టైటిల్‌ కూడా అనుకున్నారు. అలానే హిట్‌ మిషన్ అనిల్ రావిపూడిని కూడా అఖిల్‌ కోసం నాగార్జున లైన్ లో పెడుతున్నాడని తెలుస్తోంది.


ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు నాగార్జున తన కొడుకులిద్దరితో కలిసి ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఈ ఆలోచన 'మనం' రోజుల నుంచే ఉన్నా... సరైన సమయం కోసం నాగార్జున ఎదురు చూస్తున్నారట. నాగ చైతన్య 'తండేల్'తోనూ, అఖిల్ 'లెనిన్'తోనూ విజయం సాధించడంతో ఇదే 'మనం' తరహా మల్టీస్టారర్ కు పర్ ఫెక్ట్ టైమ్‌ అని నాగ్‌ భావించారట. 'మనం' సినిమాలో ప్రధాన పాత్రలను అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య పోషించారు. అఖిల్ ఆ సినిమా క్లయిమాక్స్ లో మెరుపులా మెరిశాడు. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ లో నాగార్జున... ఆయన కొడుకులిద్దరూ హీరోలుగా నటించబోతున్నారట. మేనల్లుళ్ళు సుమంత్‌, సుశాంత్‌ కూడా ఇందులో అతిథి పాత్రలు పోషిస్తారేమో చూడాలి. ఈ భారీ మల్టీస్టారర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే తీస్తారట. స్క్రిప్ట్ వర్క్ సైతం తుదిదశకు చేరుకుందని అంటున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే.. నాగార్జున వందో సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

‘వారణాసి’లో చిన్నప్పటి మహేష్‌గా అభయ్ రామ్.. స్క్రీన్స్ ఉంటాయా!

హాలీవుడ్ దర్శకుడిని ఆకర్షించిన మహేష్ తనయుడు.. ఏం జరుగుతోంది

నేనెంత దురదృష్టవంతురాలినో మాటల్లో చెప్పలేను: కౌసల్య

Updated Date - Jul 13 , 2026 | 04:16 PM