అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌లో డాల్బీ అట్మాస్ 7.1.4 హెచ్‌ఈ మిక్స్ ప్రారంభం
ABN, Publish Date - Feb 10 , 2026 | 04:31 PM
సినీ ప్రియులకు డాల్బీ డీటీఎస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లో కొత్త అనుభూతిని కలిగించే సౌండ్ సిస్టమ్ ఇది. ఇప్పుడు దీనికి అడ్వాన్స్డ్ గా డాల్బీ అట్మాస్ కూడా వచ్చింది.
సినీ ప్రియులకు డాల్బీ డీటీఎస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లో కొత్త అనుభూతిని కలిగించే సౌండ్ సిస్టమ్ ఇది. ఇప్పుడు దీనికి అడ్వాన్స్డ్ గా డాల్బీ అట్మాస్ కూడా వచ్చింది. అయితే అట్మాస్ ఫీచర్ ఉన్న థియేటర్ లో సినిమా చూసిన ప్రేక్షకుడు సాధారణ డీటీఎస్ థియేటర్లో సినిమా చూడలేడు. అందులో సౌండ్ డివైడింగ్ అంతగా ప్రభావం చూపుతుంది. దీనిలో మరో కొత్త ఫీచర్ డాల్బీ అట్మాస్ 7.1.4 హెచ్‌ఈ మిక్స్ (Dolby atmos 7.1.4 HE mix) ఫెసిలిటీని అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాలో (Annapurna Film School) నాగార్జున అక్కినేని, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కలిసి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 'విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 7.1.4 మిక్స్ ఫెసిలిటీని అన్నపూర్ణ కాలేజ్‌లో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమాకు ప్రాణం పోసేది సౌండ్. సినిమా ఎప్పటికప్పుడు టెక్నాలజీపై ఆధారపడుతోంది. అందుకే మా కాలేజ్‌లో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండేలా ఎప్పుడూ కృషి చేస్తున్నాం' అని తెలిపారు.
ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ 'సౌండ్ సినిమాకి ఆత్మ. సౌండ్ స్కేప్ తెరపై భావోద్వేగాలను మరింత లోతుగా ఆవిష్కరిస్తుంది, కథనానికి ప్రాణం పోస్తుంది, ప్రేక్షకుల కు కొత్త అనుభూతి కలిగిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ విద్యార్థులు ఈ టెక్నాలజీని నేర్చుకుంటూ, ప్రయోగాలు చేస్తూ సౌండింగ్ లో మరింత కొత్తదనాన్ని తీసుకొస్తారని ఆశిస్తున్నాను' అని అన్నారు.