Ninne Pelladatha: 'గ్రీకువీరుడి'కి.. అప్పుడే 30 ఏండ్లయ్యాయ
ABN, Publish Date - Oct 04 , 2026 | 02:08 PM
కింగ్ నాగార్జున మరపురాని చిత్రాల్లో నిస్సందేహంగా 'నిన్నే పెళ్ళాడతా' ఒకటి. నాగార్జున నటించి, నిర్మించిన 'నిన్నే పెళ్ళాడతా' 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం.
ప్రతిభ ఎక్కడ ఉన్నా పసికట్టి పట్టం కట్టడంలో 'అన్నపూర్ణ' సంస్థ ఎప్పుడూ ముందుండేది. ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూనే తండ్రి ఏయన్నార్ బాటలో పయనిస్తూ నాగార్జున (Nagarjuna) చిత్రాలు నిర్మించారు. తొలి చిత్రం 'గులాబి'తోనే దర్శకునిగా తానేమిటో ప్రూవ్ చేసుకున్న కృష్ణవంశీ (Krishna Vamsi)కి వెంటనే ఛాన్స్ ఇచ్చారు నాగ్. కృష్ణవంశీ సైతం నాగ్ అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తత్ఫలితంగా రూపొందిన చిత్రమే 'నిన్నేపెళ్ళాడతా (Ninne Pelladatha). అన్నపూర్ణ సినీస్టూడియోస్ (Annapurna Studios) పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో టబు (Tabu) నాయిక. 1996 అక్టోబర్ 4న విడుదలైన 'నిన్నే పెళ్ళాడతా' సూపర్ హిట్‌గా నిలచింది. ఆ యేడాది టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా వెలిగింది. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం ఓ ఎస్సెట్. ఇందులో నటించిన చంద్రమోహన్, చలపతిరావు, గిరిబాబు, లక్ష్మి వంటి సీనియర్స్ తరువాత బిజీ అయిపోయారు.
యన్టీఆర్‌ను.. గుర్తు చేస్తూ
ఈ సినిమా రిలీజైన 1996 జనవరిలోనే నటరత్న యన్టీఆర్ పరమపదించారు. 1968లో యన్టీఆర్ నటించిన 'నిన్నే పెళ్ళాడుతా' సినిమా వచ్చింది. అదే టైటిల్‌కు కాస్త మార్పుతో 'నిన్నే పెళ్ళాడతా' వెలసింది. యన్టీఆర్ కు నివాళిగా అన్నట్టు ఈ సినిమా టైటిల్స్ సమయంలో ఆయన నటించి, దర్శకత్వం వహించిన 'సీతారామ కళ్యాణం'లోని టైటిల్ సాంగ్‌ను ఇందులో వినియోగించుకోవడం విశేషం. 'నిన్నే పెళ్ళాడతా'లో అన్నలను కాదని కోరుకున్న వాడిని పెళ్ళి చేసుకున్న చెల్లి కథ ముందుగా కనిపిస్తుంది. అనుకోకుండా ఆ చెల్లి కూతురు ఆమె అన్నయ్యల చెంతకే రావడం- వారి అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించడం, కాసిన్ని గొడవలు- చివరకు కథ సుఖాంతం కావడం కనిపిస్తాయి. కథ పాతదే అయినా దానిని అప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కించారు కృష్ణవంశీ. ఇందులోని కొన్ని పాటలను, సన్నివేశాలను చూస్తే హిందీ 'హమ్ ఆప్కే హై కౌన్' ప్రభావం కనిపిస్తుంది.
నట నిర్మాతగా.. నాగ్‌కు స్పెషల్
'నిన్నే పెళ్ళాడతా' చిత్రం అనూహ్య విజయం సాధించింది. 30కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. అప్పట్లో నాగ్ కెరీర్ లో అత్యధిక సెంటర్స్‌లో వంద రోజులు చూసిన సినిమాగా 'నిన్నే పెళ్ళాడతా' నిలచింది. ఇతర పోటీ చిత్రాలు సక్సెస్ రూటులో సాగినా, యువతను భలేగా ఆకట్టుకుందీ చిత్రం. ముఖ్యంగా నాగార్జున, టబు జోడీ కుర్రకారును కిర్రెక్కించింది. కొన్ని థియేటర్స్‌లో 'నిన్నే పెళ్ళాడతా' రికార్డ్ షేర్స్ చూసింది. హైదరాబాద్ తో పాటు మరికొన్ని కేంద్రాల్లోనూ డైరెక్టుగా సిల్వర్ జూబ్లీ చూసిన 'నిన్నే పెళ్ళాడతా'కు కొన్ని ఫిలిమ్ ఫేర్ అవార్డులు, నంది అవార్డులు దక్కాయి. ఈ చిత్రాన్ని తమిళంలో 'ఉన్నయియే కళ్యాణమ్ పన్నిక్కిరేన్' టైటిల్‌తో డబ్ చేశారు. హిందీలో 'జబ్ దిల్ కిసీ పే ఆతా హై' పేరుతోనూ అనువాదమయింది. నట నిర్మాతగా నాగ్‌కు 'నిన్నే పెళ్ళాడతా' ఓ మరపురాని చిత్రంగా నిలచింది. ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాను ఈ నాటికీ ఆదరిస్తూనే ఉన్నారు.