సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యన్టీఆర్ టైటిల్స్... నాగ్ మూవీస్...

ABN, Publish Date - Mar 30 , 2026 | 04:50 PM

కింగ్ నాగార్జున తాజా సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 30న వారికి ఆనందం పంచుతూ గతంలోని నాగ్ చిత్రాలు రెండు విశేషంగా నిలిచాయి. ఇంతకూ ఏమిటా విశేషం!?

Akkineni Nagarjuna

నాగార్జున ప్రస్తుతం తన నూరవ సినిమాగా రూపొందుతోన్న 'లాటరీ కింగ్'లో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు రా.కార్తిక్ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేసిన 'ఎదురులేని మనిషి' మార్చి 30తో పాతికేళ్ళు పూర్తి చేసుకుంది. అలాగే ఆయనకు ఉత్తమ నటునిగా మూడవ నందిని అందించిన 'శ్రీరామదాసు' ఇదే తేదీన ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం విశేషం. అలా మార్చి 30న రెండు నాగార్జున సినిమాలు విశేషాలుగా ఫ్యాన్స్ కు ఆనందం పంచాయి.


అంతకు ముందు 1996లో నాగార్జున నటించిన 'నిన్నే పెళ్ళాడతా' చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సినిమా టైటిల్ 1968లో వచ్చిన నటరత్న యన్టీఆర్ 'నిన్నే పెళ్ళాడుతా'ను పోలి ఉండడం అప్పట్లో భలే విశేషంగా ముచ్చటించుకున్నారు. ఆ తరువాత మరో ఐదేళ్ళకు యన్టీఆర్ 'ఎదురులేని మనిషి' టైటిల్ తోనే నాగార్జున మూవీ తెరకెక్కింది. దాంతో ఈ సినిమా కూడా బంపర్ హిట్ అవుతుందని ఆశించారు ఫ్యాన్స్. డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ద్వారా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకునిగా పరిచయం అయ్యారు. ఇందులో నాగ్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేశారు. సౌందర్య, షెహనాజ్ నాయికలుగా నటించారు. ఈ చిత్రం 2001 మార్చి 30న విడుదలయింది. అయితే ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది. కొన్ని కేంద్రాలలో శతదినోత్సవం చూసిందీ చిత్రం. ఎస్.ఏ.రాజ్ కుమార్ 'ఎదురులేని మనిషి'కి కొన్ని వినిసొంపైన గీతాలు సమకూర్చారు. ఈ చిత్రం రిలీజైన ఐదేళ్ళకు ఇదే తేదీన నాగార్జున హీరోగా రూపొందిన 'శ్రీరామదాసు' రిలీజై విశేషాదరణ చూరగొంది. అందువల్లే ఫ్యాన్స్ మార్చి 20న ఈ రెండు చిత్రాలను తలచుకున్నారు.


'శ్రీరామదాసు' మూవీకి ముందు 1964లో మహానటుడు చిత్తూరు నాగయ్య 'భక్త రామదాసు' చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించారు. ఆ సినిమా అంతగా అలరించలేక పోయింది. అదే ఇతివృత్తంతో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రధారిగా 'శ్రీరామదాసు' తెరకెక్కించే సమయంలో కొన్ని విమర్శలు వినిపించాయి. ఈ చిత్రాన్ని కొండా కృష్ణంరాజు నిర్మించారు. స్నేహ నాయికగా నటించారు. కబీర్ పాత్రలో ఏయన్నార్ కనిపించారు. 'శ్రీరామదాసు' చిత్రం మంచి విజయం సాధించి, అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. 'శ్రీరామదాసు'కు ముందు నాగార్జునతో కె.రాఘవేంద్రరావు 'అన్నమయ్య' వంటి భక్తిరస చిత్రం రూపొందించి విజయం సాధించారు. ఆ సినిమాకు సంగీతం సమకూర్చిన కీరవాణి 'శ్రీరామదాసు'కు కూడా వినసొంపైన బాణీలు కట్టారు. ఈ రెండు చిత్రాలతోనూ నాగార్జున ఉత్తమ నటునిగా 'నంది' అవార్డును అందుకోవడం విశేషం. అలా 'శ్రీరామదాసు' మూవీ నాగార్జున ఫ్యాన్స్ కు ఓ మరపురాని చిత్రంగా నిలచింది. అదే తీరున 'ఎదురులేని మనిషి'నీ తలచుకున్నారు. ఈ ఆనందంలో రాబోయే నాగ్ నూరవ సినిమావైపు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Updated Date - Mar 30 , 2026 | 04:50 PM