Vrushakarma: వృషకర్మ ట్రైలర్లో అసలు హైలైట్ ఇదే!
ABN , Publish Date - Nov 26 , 2026 | 11:59 AM
అక్కినేని నాగచైతన్య ఈసారి ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ‘విరూపాక్ష’తో సస్పెన్స్ థ్రిల్లర్‌ను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ దండు.. ఇప్పుడు ‘వృషకర్మ’తో మరో ఆసక్తికరమైన ప్రయోగానికి తెరతీశారు.
అక్కినేని నాగచైతన్య ఈసారి ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ‘విరూపాక్ష’తో సస్పెన్స్ థ్రిల్లర్‌ను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ దండు.. ఇప్పుడు ‘వృషకర్మ’తో మరో ఆసక్తికరమైన ప్రయోగానికి తెరతీశారు. మైథాలజీ, హారర్, మిస్టరీ, ట్రెజర్ హంట్ అంశాలను మేళవించి రూపొందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే టీజర్‌తో ఆసక్తిని పెంచిన చిత్రబృందం.. ట్రైలర్‌తో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.
అసలు హైలైట్ ఇదే!
‘సృష్టి ధర్మాన్ని కాపాడటం కోసం సాక్షాత్తూ ఆ దైవమే ఎంచుకున్న వృషకర్మవు నువ్వే’ అనే సంభాషణతో ఈ కథలోని అసలు పాయింట్‌ను పరిచయం చేశారు. భూమిపైకి వచ్చిన ఓ అతీంద్రియ శక్తి మానవాళి వినాశనానికి ప్రయత్నిస్తుంటే.. దానిని అడ్డుకునేందుకు దైవం ఎంచుకున్న వ్యక్తిగా నాగచైతన్య పాత్రను చూపించారు. ‘అతీంద్రియ శక్తి తన బలిని ఎంచుకుంది’ అనే డైలాగ్‌తో మొదలయ్యే ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఓ పురాతన గుహ, అందులో బయటపడిన 5 వేల ఏళ్ల నాటి శిల్పాలు, భారీ ఆకారం.. వీటి చుట్టూ అల్లుకున్న మిస్టరీ కథపై ఆసక్తిని పెంచుతోంది. ఈ గుహ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అక్కడి విగ్రహానికి మానవాళికి ఎదురుకాబోయే ప్రమాదానికి ఉన్న సంబంధం ఏంటి? అన్న ప్రశ్నలను ట్రైలర్లో ప్రస్తావించారు. ముఖ్యంగా పురాతన చరిత్రకు అతీంద్రియ శక్తులను జోడించిన విధానం కొత్త అనుభూతిని కలిగించేలా ఉంది.
నాగచైతన్య లుక్, విజువల్స్ అదుర్స్!
ట్రెజర్ హంటర్‌గా నాగచైతన్య లుక్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ సన్నివేశాలు, ప్రమాదకరమైన గుహల్లో సాగే అన్వేషణ, మిస్టరీని మరింత పెంచే విజువల్స్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మీనాక్షి చౌదరి ఆర్కియాలజిస్ట్ దక్ష పాత్రలో కనిపిస్తున్నారు. కథలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏమిటన్నది ఆసక్తిని కలిగిస్తోంది. ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడిగా కనిపించడం మరో ప్రత్యేకత.
సాంకేతికంగా మరో స్థాయి!
దర్శకుడు కార్తీక్ దండు మరోసారి తనదైన మేకింగ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సుకుమార్ అందించిన కథలోని మైథాలజీ, మిస్టరీ అంశాలను విజువల్‌గా ఆసక్తికరంగా ఆవిష్కరించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం హారర్ వాతావరణంలోకి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇప్పటివరకు నాగచైతన్య చేసిన సినిమాలతో పోలిస్తే ‘వృషకర్మ’ పూర్తిగా భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రంగా కనిపిస్తోంది. మైథాలజీకి ట్రెజర్ హంట్, హారర్, సస్పెన్స్ అంశాలను జోడించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్లో రేకెత్తించిన ప్రశ్నలకు సినిమాలో ఎలాంటి సమాధానాలు ఇచ్చారు? కథలోని మిస్టరీని ఎంత ఆసక్తికరంగా తెరకెక్కించారు? అన్నదే అసలు పరీక్ష. మొత్తంగా ట్రైలర్ మాత్రం సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. డిసెంబర్ 4న విడుదల కానున్న ‘వృషకర్మ’తో నాగచైతన్య ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
ALSO READ:
ఆడంబరాల పెళ్లి.. ‘ఆత్మగౌరవ వివాహం'లో మిగిలిందేమిటి?
బాలయ్య కూతురు సినిమా.. హీరో ఎవరో తెలుసా
ఆయనలా సీఎం అవుతా.. శర్వానంద్ ఏంటి అలా అనేశాడు