Nag Ashwin: మూడో చిత్రంతో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి....

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:31 PM

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ 'కల్కి' సీక్వెల్ గా 'కర్ణ' తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 23న బర్త్ డే జరుపుకున్న నాగ్ అశ్విన్ చిత్రసీమలో సాగుతున్న తీరును గుర్తు చేసుకుందాం.

Nag Ashwin

'ఎక్కడ పోగొట్టుకుంటామో - అక్కడే వెతకాలి' అంటారు. నాగ్ అశ్విన్ మనసు సినిమాల్లో పడేసుకున్నారు. అక్కడే రాణించాలని దీక్షపూనారు. చివరకు 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో మెగాఫోన్ పట్టి జనాన్ని మెప్పించారు నాగ్ అశ్విన్. ఆ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'మహానటి', 'కల్కి 2898 ఏడి' చిత్రాలు సైతం ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. 'కల్కి 2898 ఏడి' చిత్రంతో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరారు నాగ్ అశ్విన్. ఆ ఘనత సాధించిన రెండవ తెలుగు దర్శకునిగా నిలిచారు అశ్విన్. ఏప్రిల్ 23న నాగ్ అశ్విన్ నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు విషెస్ తెలిపారు.


నాగ్ అశ్విన్ కన్నవారు జయరామ్, జయంతి ఇద్దరూ హైదరాబాద్ లో పేరొందిన డాక్టర్లు. వారి జె.జె. హాస్పిటల్ కు ఎంతో పేరుంది. కన్నవారు, తోడబుట్టిన చెల్లెలు అందరూ వైద్యవృత్తినే ఎంచుకున్నారు. అయితే నాగ్ అశ్విన్ మాత్రం సినిమాలపై అభిమానంతో 'మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్' లో మాస్ కమ్యూనికేషన్స్ డిగ్రీ చేశారు. తరువాత న్యూయార్క్ ఫిలిమ్ అకాడమీ లో ఫిలిమ్ డైరెక్షన్ కోర్స్ పట్టా పుచ్చుకున్నారు. 'లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్ద అసోసియేట్ గా పనిచేశారు నాగ్ అశ్విన్. తరువాత 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు అశ్విన్. తొలి సినిమాతోనే దర్శకునిగా మంచి మార్కులు సంపాదించారాయన.


'ఎవడే సుబ్రమణ్యం' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ కూతుళ్ళు ప్రియాంక దత్, స్వప్నా దత్ నిర్మించారు. వారిలో ప్రియాంకను 2015లోనే నాగ్ అశ్విన్ వివాహం చేసుకున్నారు. తొలి చిత్రంతోనే డైరెక్టర్ గా తానేమిటో ప్రూవ్ చేసుకున్న నాగ్ అశ్విన్ పై అందరికీ గురి కుదిరింది. రెండో సినిమాగా మహానటి సావిత్రి జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా 'మహానటి' చిత్రం రూపొందించారు. ఈ మూవీ పలు అవార్డులూ రివార్డులూ సంపాదించుకుంది. తరువాత భారీ స్థాయిలో ప్రభాస్ హీరోగా అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో 'కల్కి' రూపొందించారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా 'కర్ణ 3102 బీసీ' రూపొందిస్తున్నారు అశ్విన్. మరి ఈ సినిమాతో ఏ రేంజ్ లో నాగ్ అశ్విన్ అలరిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఓటు ఎవరికి వేశాడో.. పబ్లిగ్గా చెప్పేసిన వీటీవీ గణేష్.. వీడియో వైరల్!

ధనుష్ - మృణాల్.. మళ్లీ మొదలు! అసలు విషయం ఏమిటంటే?

Updated Date - Apr 23 , 2026 | 03:43 PM