ఈ రెండు సినిమాలతో నటిగా సంతృప్తిగా ఉంది - నభా నటేష్
ABN , Publish Date - Jun 29 , 2026 | 09:53 PM
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత నభా నటేష్ వరుస అవకాశాలతో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు.. కానీ అది జరగలేదు. మధ్యలో ఆమెకు యాక్సిడెంట్ అవడంతో.. దాదాపు సంవత్సరానికి పైగా రెస్ట్ మోడ్‌లోనే ఆమె ఉండాల్సి వచ్చింది.
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత నభా నటేష్ (Nabha Natesh) వరుస అవకాశాలతో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు.. కానీ అది జరగలేదు. మధ్యలో ఆమెకు యాక్సిడెంట్ అవడంతో.. దాదాపు సంవత్సరానికి పైగా రెస్ట్ మోడ్‌లోనే ఆమె ఉండాల్సి వచ్చింది. రీ ఎంట్రీలో మాత్రం రెండు బిగ్ ప్రాజెక్ట్స్‌లో ఆమె అవకాశాలు సొంతం చేసుకుంది. అందులో ఒకటి ‘నాగబంధం’ (Nagabandham) కాగా, రెండో ‘స్వయంభూ’ (Swayambhu). ఈ రెండు సినిమాలలో నటించినందుకు నటిగా చాలా సంతృప్తిని పొందానని తెలిపింది నభా. తాజాగా ఆమె ‘నాగబంధం’ మూవీ విశేషాలను తెలిపేందుకు మీడియాతో సమావేశమయ్యారు. జూలై 3న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను ఆమె మీడియాకు తెలిపారు.
‘‘ఈ ‘నాగబంధం’లో నేను చేసిన పాత్రను.. ఇంతకు ముందెన్నడూ చేయలేదు. ఇందులో నేను పార్వతి అనే పాత్రలో కనిపిస్తాను. వేదం నేర్చుకునే విద్యార్థినిగా కనిపిస్తాను. నా పాత్ర ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా నిలబడే వ్యక్తిత్వం. కథలో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. పార్వతి తీసుకునే ప్రతి నిర్ణయం కథపై ప్రభావం చూపుతుంది. ప్రేక్షకులు కచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతారు. ఈ సినిమా కోసం నిర్మించిన అనంత పద్మనాభ స్వామి ఆలయ సెట్ నిజంగా ఆలయంలోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది. ఆ సెట్‌ను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ప్రేక్షకులను కూడా ఆ విజువల్స్ తప్పకుండా మెస్మరైజ్ చేస్తాయి.
డైరెక్టర్ అభిషేక్ నామా క్లియర్ విజన్‌తో ఉన్నారు. ఆయన ఈ కథను చాలా అద్భుతంగా ఊహించుకున్నారు. ప్రతి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్.. ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా డీటెయిల్‌గా డిజైన్ చేశారు. ఆయన నాకు కథ చెప్పినప్పుడే నేను మెస్మరైజ్ అయ్యాను. ప్రతి సీన్‌కు స్టోరీ బోర్డ్ సిద్ధం చేసుకున్నారు. ప్రతి పాత్ర యాక్షన్, రియాక్షన్‌లను ముందుగానే స్కెచ్ చేసి రెడీ చేశారు. ఇందులో నా పాత్ర కోసం రెడీ అవ్వడానికి దాదాపు రెండు గంటలు పట్టేది. ప్రతి కాస్ట్యూమ్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. షూటింగ్ టైమ్‌లో చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఇందులో నా పాత్రకు రొమాన్స్ ఉంటుంది. రొమాన్స్‌తో పాటు చాలా ముఖ్యమైన అంశాలు నా పాత్రలో ఉంటాయి. అవే కథకు కీలక మలుపు తీసుకొస్తాయి.
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత నాకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. దాని వల్ల భుజానికి గాయమైంది. ఆ కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు బ్రేక్ తీసుకున్నాను. ఫిజికల్‌గా, మెంటల్‌గా పూర్తిగా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాను. స్క్రీన్‌పై ఎనర్జీతో కనిపించినప్పుడే పాత్రకు న్యాయం చేయగలనని భావించి.. పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ నటించడం ప్రారంభించాను. ప్రస్తుతం రెండు భారీ సినిమాలు నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రెండు కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూడదగ్గ సినిమాలే కావడంతో కచ్చితమైన రెండూ నాకు అద్భుతమైన సక్సెస్‌ని ఇస్తాయని ఎంతో నమ్మకంతో ఉన్నాను. ఇలాంటి రెండు చిత్రాల్లో భాగమైనందుకు చాలా గర్వంగా ఉండటమే కాకుండా.. ఒక నటిగా నాకు చాలా సంతృప్తిగా ఉంది’’ అని నభా చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
డెలివరీ బాయ్‌ని కొట్టిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో.. వీడియో వైరల్
‘విశ్వంభర’ సెన్సేషనల్ అప్డేట్.. ఇక విడుదలే!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అనౌన్స్‌మెంట్.. పోస్టర్ అదిరిపోయిందిగా!