Jayam Manade: 70 ఏళ్ళ.. 'జయం మనదే'
ABN, Publish Date - May 05 , 2026 | 11:28 PM
‘పాతాళభైరవి’ ఘనవిజయం తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో జానపద కథలకు మంచి ఆదరణ లభించింది. ఆ తరహాలోనే విప్లవాత్మక జానపద కథలకు కొత్త క్రేజ్ తీసుకువచ్చిన చిత్రంగా ‘జయం మనదే’.
తెలుగునాట అంతకు ముందు 'పాతాళభైరవి' ఘనవిజయంతో ఆ రీతిన సాగే కథలతోనే కొన్ని జానపదాలు సందడి చేశాయి. తరువాతి రోజుల్లో తెలుగు సినిమా విప్లవ జానపద గాథలకు క్రేజ్ తీసుకు వచ్చిన చిత్రంగా జయం మనదే (Jayam Manade) నిలచింది. 1956 మే 4వ తేదీన విడుదలయిన ఈ చిత్రానికి హిందీలో రూపొందిన 'బాదల్' (1951) ఆధారం. అందులో ప్రేమ్ నాథ్, మధుబాల జంటగా నటించారు. తెలుగులో ఆ చిత్రాన్ని యన్టీఆర్ (N. T. Rama Rao), అంజలీదేవి (Anjali Devi) జంటగా తాతినేని ప్రకాశరావు (T. Prakash Rao) దర్శకత్వంలో రాజశ్రీ బ్యానర్ పై సుందర్ లాల్ నహతా నిర్మించారు.
మహారాజు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ప్రచండడు అనే సేనాపతి ప్రజలపై అన్యాయంగా పన్నులు వేసి వసూలు చేస్తూంటాడు. కట్టలేక ఎదురుతిరిగిన వారిని చంపేస్తూంటాడు. రోశయ్య అనే రైతును ఆయన కొడుకు ప్రతాప్ కళ్ళముందే చంపేస్తారు. ప్రతాప్ ఎలాగైనా ప్రచండునిపై పగతీర్చుకోవాలనుకుంటాడు. అతనికి జోగులు, మల్లిక అనే స్నేహితులు బాసటగా నిలుస్తారు. తరువాత ఓ విప్లవ బృందాన్ని తయారు చేస్తారు. ప్రచండుని అంతమే లక్ష్యంగా సాగుతారు. ఓ సామంతరాజు కూతురు శోభాదేవిని విప్లవకారులు పట్టుకుంటారు. ఆమెను ప్రతాప్ రక్షిస్తాడు. దాంతో వారిద్దరి మధ్య ప్రేమ అంకురిస్తుంది. మహారాజు కూతురును మనువాడి, రాజు కావాలని చూస్తాడు ప్రచండుడు. ప్రతాప్ వెళ్ళి అడ్డుకోవాలను కుంటాడు. అతడిని బంధిస్తారు. ఓ ముసుగు వ్యక్తి వచ్చి రక్షిస్తారు. చివరకు ప్రచండుని శిక్షిస్తారు. ఓ నీచునికి అధికారం అప్పగించినందుకు ప్రజలకు మహారాజు క్షమాపణ చెబుతారు. తన వారసుడు ప్రతాప్ అని ప్రకటిస్తారు రాజు. ఆ ముసుగు వ్యక్తి శోభ అని తేలుతుంది. ప్రతాప్, శోభ వివాహంతో కథ సుఖాంతమవుతుంది.
కథను చూస్తే, తరువాతి రోజుల్లో వచ్చిన విప్లవ జానపద చిత్రాలు "బందిపోటు, అగ్గిబరాటా, రణభేరి, సింహబలుడు" వంటివి గుర్తుకు రాకమానవు. ఇందులో ప్రతాప్ గా యన్టీఆర్, శోభాదేవిగా అంజలీదేవి, ప్రచండునిగా ఆర్. నాగేశ్వరరావు, మహారాజుగా గుమ్మడి, సామంతరాజుగా సీయస్సార్, జోగులుగా రేలంగి, మల్లికగా షావుకారు జానకి నటించారు. ఈ చిత్రానికి ఘంటసాల సంగీతం ప్రాణం పోసింది. వెంపటి సదాశివబ్రహ్మం, సీనియర్ సముద్రాల, కొసరాజు, ముద్దుకృష్ణ, జంపన పాటలు రాశారు. ఇందులోని "వినవోయి బాటసారీ...", "ఓ చందమామ...అందాలభామ..", "చూడచక్కని దానా..", "మరువజాలని మనసు చాలని...", "వస్తుందోయ్ వస్తుంది..." అంటూ సాగే పాటలు అలరించాయి. 'జయం మనదే' చిత్రం 1956 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఇక రిపీట్ రన్స్ లోనూ ఈ చిత్రం విశేషాదరణ చూరగొంది.