సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సెలవన్న కోకిలమ్మ..

ABN, Publish Date - Jul 11 , 2026 | 08:37 PM

తెలుగునాట పుట్టి, చెన్నపట్టణంలో అడుగు పెట్టి- యావత్ భారతాన్నీ తన పాటతో కట్టిపడేశారు జానకి... దక్షిణాది అన్ని రాష్ట్రాలు జానకిని గానకోకిలగా తమ మదిలో నిలుపుకున్నాయి...

S. Janaki

పంచభూతాలనే పరవశింపచేసే గాత్రం ఎస్. జానకి సొంతం... జానకి గానమాధుర్యంలో యావద్భారతము ఆనందడోలికల్లో ఊగింది... అశేష అభిమానగణాలను శోకసముద్రంలో ముంచుతూ యస్.జానకి దివికేగారు...

తెలుగునాట పుట్టి, చెన్నపట్టణంలో అడుగు పెట్టి- యావత్ భారతాన్నీ తన పాటతో కట్టిపడేశారు జానకి... దక్షిణాది అన్ని రాష్ట్రాలు జానకిని గానకోకిలగా తమ మదిలో నిలుపుకున్నాయి... ఈ నాటికీ జానకి పాటతో పరవశించి పోయేవారు ఎందరో ఉన్నారు.... తెలుగునేలను పులకింపచేసిన కోకిలమ్మలు ఎందరు ఉన్నా, వారిలో ఎస్.జానకి బాణీయే వేరు... స్వరాలకు అనుగుణంగా తన స్వరపేటికను మార్చుకోగల శక్తి జానకి సొంతం... బాల్యంలోనే ఆమె గళంలో జాలువారే ఏ పదమైనా రాగయుక్తంగా సాగి మనసుల్ని పులకింప చేస్తూ ఉండేది... అదే ఆమెను చెన్నపట్టణం చేర్చింది... అక్కడే జానకిలోని గాయని వెలుగు చూసింది... అభిమానగణాలను పోగేసుకుంది...


జానకి ఆరంభంలోనే పలువురు ప్రఖ్యాత సంగీత దర్శకుల స్వరకల్పనలో పాటలు పాడే అవకాశం  సంపాదించారు... ఆమె గళంలోని మాధుర్యం అప్పట్లోనే ఎందరో సంగీత పిపాసుల హృదయాలను పరవశింపచేసింది... పాట ఏదైనా సరే తన మధురగాత్రంతో సదరు గీతాన్ని అమృతతుల్యం చేయడం జానకమ్మలోని ప్రత్యేకత! ఎందరో కవిరాజులు ఆ రోజుల్లో తమదైన బాణీ పలికిస్తూ భావకవిత్వం చిలికించారు... అందుకు తగ్గట్టుగా వారి కలం పలికిన పదాలను తన గళంలో నింపుకొని అమృతం కురిపించారు జానకి... ఆ పదాలు నేటికీ మధురం పంచుతూనే సంగీతాభిమానులను ఆకర్షిస్తున్నాయి...


తొలి రోజుల్లో జానకిని ఆ నాటి కొందరు స్టార్ హీరోయిన్స్ సెకండ్ గ్రేడ్ సింగర్ గా గుర్తించారు... అలాంటి వారికి తన గళంతోనే సమాధానం చెప్పిన మధురగాయని జానకి... తాను మాత్రం నాటి వర్ధమాన నాయికలకు సైతం పాడి, వారిని విజయపథంలో పయనింప చేశారు ఈ గానకోకిల... తన గాత్రమాధుర్యంతో స్వపరభేదం లేకుండా పలు భాషలవారిని పరవశింపచేశారు జానకి... ఆమె తెలుగునేలపై జన్మించడం నిజంగా తెలుగువారి అదృష్టం... ఏ భాషలో పాడినా జానకి పాట తేనెలూరిస్తూనే ఉంటుంది... మాతృభాషలో పాడితే ఆ మాధుర్యం మరింత మధురంగా ఉంటుందనడంలో సందేహమేముంది... కోకిల స్వరంతోనే పోటీపడి పాడగల నేర్పు జానకి గాత్రానికి మాత్రమే అబ్బిన విద్య అనిపిస్తుంది... పలువురు సంగీత దర్శకులు ఆ సత్యం తెలిసినవారు కాబట్టే, కోకిల కువకువలతోనే జానకి ఆలాపనను మేళవించి మధురామృతం పంచిన సందర్భాలున్నాయి... ఈ గీతాలను ఒక్కసారి వింటే చాలు రాతిగుండెల్లో సైతం తేమ ఊరక మానదు...


జానకి గళంలో జాలువారే చిలిపిదనం వింటే మనసు చిందులు వేస్తుంది... ఆ పాటలోని మాటలకు అర్థాలు తెలియని మనుషులు సైతం జానకి గాత్రమహిమకు సాహో అనవలసిందే... ఆ గానంతో సాగవలసిందే... అలుపు లేకుండా గెలుపు దొరుకుతుందనే నమ్మకంతో చిందేయ వలసిందే!...


నవ్వించడమే కాదు, కరుణ కురిపించడంలోనూ జానకమ్మ గాత్రం భలేగా సాగింది... ఆ సందర్భాల్లో జానకమ్మ గళం చేసిన విన్యాసాలు మన కళ్ళను చెమ్మగిల్లేలా చేస్తాయి... మనసును తడిచేయడమే కాదు, దానికి ఊరట కలిగించడమూ ఆమె గాత్రంలో దాగుందని చెప్పవచ్చు... తన దరికి చేరిన సవాళ్లను ఆనందంగా స్వీకరించి, పౌరాణికాల్లోనూ తనదైన బాణీ పలికిస్తూ గానం చేశారు జానకి... అంతకుముందు ఇతర గాయనీమణులు ఆలపించిన పాటల్లాంటివే తానూ గానం చేసి తనదైన ముద్రను వేశారు జానకి... ఇక సందర్భానుసారంగా అక్కడా తన గళంలో ఆమె చేసిన విన్యాసాలు భలే గమ్మత్తుగా మనపై మత్తు చల్లుతాయి... పురాణగాథల్లోనూ పరవశింప చేసిన జానకి గాత్రం, భక్తి పారవశ్యాన్ని సైతం మనలో నింపేలా పల్లవించింది... జానకి ఆలపించిన పలు పాటల్లోని భక్తిభావం మన మనసులను హత్తుకొని మెత్తగా మనల్ని సైతం పరంధామునివైపు పరుగులు తీసేలా చేసిన సందర్భాలున్నాయి... కళారాధనలో పరితపించే హృదయాలను ప్రతీసారి పరవశింప చేయడం అంత సులువు కాదు... జానకి గళంలో జాలువారిన ప్రతీ పదం సులువుగా మన మనసులు దోచేస్తూ ఉంటుంది... అదీ ఆ గాత్రంలోని మహత్యం... కళకు తగ్గట్టుగా గళం సాగించి మధురాన్ని మన సొంతం చేస్తుంది...


నర్తనవేళ అందెల రవళికి తగ్గ గానం చేసి పులకింపచేయడంలో జానకి గాత్రం సాగిన తీరు మనల్ని ఒక పట్టాన వదలదు... ఏ చోటకు వెళ్ళినా మనలను వెంటాడుతూనే ఉంటుంది... ఒకసారి కాదు పలుమార్లు ఆ తీయదనం నాట్యానికి అనువుగా పల్లవించి పరవశింప చేసింది... ఆ మధురం నెమలికి నడకలు నేర్పుతుంది - మురళికి అందని పలుకులూ వినిపిస్తుంది...

భావకవుల కవిత్వంలో వెల్లివిరిసిన దేశభక్తి మరింత మధురంగా ఉంటుందంటారు... ఆ మధురానికి జానకమ్మ గళం తోడయితే, ఆ రుచి గురించి వేరే చెప్పాలా!?... తీపి మరీ ఎక్కువైనా రుచించదు అంటారు...కానీ, జానకమ్మ గాత్రంలో జాలువారిన దేశభక్తి గీతాలు మనసు కోరుకొనే మధురాన్నే పంచాయి...

పసిపాప బోసినవ్వులోనే దైవమున్నాడని అంటారు వేదాంతులు... ఏలాంటి కల్మషం లేని పసిహృదయాలకు తగ్గ రీతిలోనే పల్లవించి వారి అమాయకత్వాన్ని తన గాత్రంలో పలికించారు జానకి... సదరు పాటలను ఒక్కసారి వింటే చాలు మన మనసుల్లో చిందులేసిన విచారాలు సైతం విహంగంలా ఎగిరిపోతాయి...


రాగములో అనురాగం చిందిన మనసున మధురాతి మధురం నిండి ఉంటుంది... ఆ సమయంలో ఆ పెదాలు పలికే పదాలు సైతం అమృతమయమై పోతాయి... అలాంటి సందర్భాల్లోనూ జానకి గళం పలు విన్యాసాలు చేస్తూ పండితపామరులను పరవశింప చేసింది... పదహారేళ్ళ పడచు పరువానికి లోకం కొత్తగా కనిపిస్తుంది... మనసు కొత్త దారుల్లో పయనించాలని తపిస్తుంది... తనువు కొత్త రుచులు కోరుకుంటుంది... ఇలాంటి అనుభూతులనన్నిటినీ ఓ పాటలోనే రంగరిస్తే ఆ పాటకు నిత్యనూతనత్వం చేకూరుస్తూ జానకి గానం సాగింది... ఆ పాట విన్న ప్రతీసారి కొత్తగానే ఉండడం ఆ గళంలోని ప్రత్యేకత...


ప్రతి మనిషి జీవితంలో టీనేజ్ ఓ మరపురాని మధురం... ఆ ప్రాయంలో చేసిన చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చిన ప్రతీసారి మధురమైన బాధ మన మదిని తడుతూ ఉంటుంది... పదే పదే గుర్తుకు తెచ్చుకొనీ పులకించే మనసులూ ఉంటాయి... ఆ భావనకు తగ్గ తాళాలు అమరిన వేళ, అందుకు అనుగుణంగా జానకి గళం సాగిన తీరు సైతం పులకింప చేస్తూనే ఉంటుంది...మనసులోని మర్మాలు ఎవరివి వారికే తెలియాలి... కోరుకున్నవారిని కొంగున ముడేసుకోవాలని మదిలో ఆశలు చిందులు వేస్తూంటాయి... కానీ, ఆ అభిలాష ఫలించాలంటే ఏడుకొండలవానికే నివేదించుకోవాలి... వెంకన్నస్వామి కరుణిస్తాడని, కోరిన కోరికలు తీరుస్తాడని తెలుగునేలపై ఎందరికో నమ్మకం... అందుకు తగ్గట్టుగా రూపొందిన సన్నివేశంలో జానకి గళం కాదు ఆమె ఆత్మనే గానం చేసినట్టుగా ఉంటుంది...


కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటమే జానకమ్మకు తెలుసు. ఆమెకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించినప్పుడు, తన పాటకు 'భారతరత్న' ఒక్కటే సరితూగుతుందని తెగేసి చెప్పారు. 'పద్మ' అవార్డునూ  తిరస్కరించారు. అలా తన ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న ప్రత్యేకమైన వ్యక్తిత్వమూ మన జానకమ్మ సొంతం. జానకి గాత్ర మహిమకు ఎన్నో అవార్డులూ రివార్డులూ ఆమెను వరించాయి... ఆమె పాటకు  ప్రజలే తమ మనసుల్లో పట్టాభిషేకం చేస్తున్నారు.. ఇక వేరే అవార్డులూ రివార్డులూ ఎందుకు అంటారు జానకమ్మ...  ఆమె తెలుగువారయినందుకు మనమంతా గర్విద్దాం... ప్రేక్షకాదరణను మించిన అవార్డు లేదని భావించే జానకమ్మ గానం సదా మనకు మధురమే పంచుతుంది... ఆ భావనలోనే జానకమ్మ లేని లోటును మరచిపోదాం...

Updated Date - Jul 11 , 2026 | 08:47 PM