South Stars: ముంబైపై సౌత్ స్టార్స్ మోజు..ఎందుకంటే..

ABN , Publish Date - Aug 25 , 2026 | 09:39 AM

కళలకు ఎల్లలు లేవు అన్న మాటను సౌత్ స్టార్స్ భలేగా పాటిస్తున్నారు... పాన్ ఇండియా మూమెంట్ లో మకాములే మార్చేస్తున్నారు... ముంబై మీద మోజు పెంచుకున్నారు...

కళలకు ఎల్లలు లేవు అన్న మాటను సౌత్ స్టార్స్ భలేగా పాటిస్తున్నారు... పాన్ ఇండియా మూమెంట్ లో మకాములే మార్చేస్తున్నారు... ముంబై మీద మోజు పెంచుకున్నారు... అలా సాగుతున్న వారెవరో చూద్దాం...

సెకండ్ బేస్... ముంబై...

ప్రస్తుతం యావద్భారతంలో క్రేజ్ ను సంపాదించింది టాలీవుడ్... మన తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టాలని పలువురు పరభాషల వారు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ కన్నా ముంబై మేలని భావిస్తున్నారు కొందరు టాలీవుడ్ స్టార్స్. వీరి పంథాలోనే మరికొందరు సౌత్ స్టార్స్ కూడా సాగుతూ ఉండడం విశేషంగా మారింది. హైదరాబాద్ ను 'ప్రపంచ సినిమా రాజధాని'గా మారుద్దామని పాలకులు కలలు కంటూ ఉంటే మన సౌత్ స్టార్స్ ఎందుకని ముంబై మనసు పారేసుకుంటున్నారు? ఈ ప్రశ్న ఎవరికైనా తలెత్తక తప్పదు. ప్రస్తుతం సౌత్ లో పేరున్న స్టార్స్ అందరూ 'పాన్ ఇండియా మూవీస్'లో నటించాలని ఆశిస్తున్నారు. 'పాన్ ఇండియా మూవీస్' అంటూ చెప్పుకొని తిరిగితే సరిపోదు. నార్త్ లోనూ మన సినిమాలను రిలీజ్ చేసే సత్తా కావాలి. ఏదో హైదరాబాద్, చెన్నై, కొచ్చిన్, బెంగళూరులో ఉన్నాం- అయినా మా పాన్ ఇండియా మూవీస్ కు నార్త్ లో క్రేజ్ రావాలని ఆశిస్తే సరిపోదు కదా. అందువల్లే ఉత్తరాది మూవీ మీడియేటర్స్ , డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు స్టార్స్ సైతం అందుబాటులో ఉండే ఏర్పాటు చేసుకుంటున్నారు. అందువల్లే ముంబైని సెకండ్ బేస్ గా మలచుకుంటూ ఉండడం విశేషం.

వెబ్ సిరీస్ కోసం...

టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా సాగుతోన్న రామ్ చరణ్, అల్లు అర్జున్ ముంబైలో తమకు తగ్గ ఫ్లాట్స్ ను ఏర్పాటు చేసుకున్నారు. తమిళ స్టార్స్ సూర్య, ధనుష్, మళయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముంబై మీద మనసు పారేసుకున్నారు. వారు కూడా అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. వీరందరి కంటే ముందే దగ్గుబాటి రానా ముంబైలో ఓ సొంత ఫ్లాట్ ను ఎప్పుడో ఏర్పరచుకున్నారు... వీరిలో ఎవరికి వారు తమ కారణాల వల్ల ముంబైలో తిష్ట వేస్తున్నారు. సూర్య- జ్యోతిక ఇద్దరూ ముంబైలో ఓ పర్మినెంట్ రెసిడెన్స్ చూసుకోవడం విశేషం. ఎటూ సూర్య తమిళనాట బిజీ స్టార్... జ్యోతిక తన వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ సాగుతున్నారు. ఈ మధ్య జ్యోతిక వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నారు. అందువల్ల ముంబైలో ఉంటే హిందీ వెబ్ సిరీస్ లో నటించవచ్చు అనే కారణంగా సూర్య-జ్యోతిక దంపతులు ముంబైకి మకాం మార్చినట్టు తెలుస్తోంది. బాంద్రాలో ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ ను సూర్య దంపతులు ఇటీవలే కొనుగోలు చేశారు...

అనువైన చోటు...

'మా ఇంటి బంగారం'తో బంపర్ హిట్ పట్టేసిన సమంత కూడా ముంబైలోనే ఉంటున్నారు... ఆమె భర్త రాజ్ కూడా అక్కడే ఉంటూ ఎప్పటి నుంచో సినిమాలు తెరకెక్కిస్తున్నారు... అలా ఈ జంట 15 కోట్ల విలువ చేసే 3బీహెచ్ కే ను కొన్నారు... సముద్రాన్ని చూస్తూ ఉండేలా వీరి అపార్ట్ మెంట్ ఉండడం విశేషం. ఎప్పటి నుంచో ఇటు సౌత్, అటు నార్త్ మూవీస్ లో నటిస్తున్న ఆర్.మాధవన్ బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో అదిరిపోయే అపార్ట్ మెంట్ ను తన ముంబై చిరునామాగా మార్చుకున్నారు... ఇక శ్రుతిహాసన్ ఎప్పటి నుంచో హిందీ చిత్రసీమపై కన్నేసి ముంబైకి మకాం మార్చారు. ఈ మధ్యకాలంలో ముంబైని సెకండ్ బేస్ గా మలచుకున్న మరో తార రశ్మిక మందణ్ణ... ఆమె కూడా హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. రశ్మిక భర్త విజయ్ దేవరకొండ తన మాతృభాష తెలుగుపైనే దృష్టి కేంద్రీకరించినా, పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలంటే ముంబై బేస్ ఉండాలని భావిస్తున్నారు. అందువల్ల ఈ నవదంపతులు తమకు అనువైన ఇంటిని తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఆ ఇద్దరు అలా...

బాంద్రాలోని పాలి హిల్ లో మళయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ అందమైన ఫ్లాట్ పట్టేశారు. నటునిగానే కాదు దర్శకనిర్మాతగానూ సాగుతోన్న పృథ్వీరాజ్ సైతం తన పరిధిని పెంచుకొనే నేపథ్యంలోనే ముంబైని సెకండ్ బేస్ గా మార్చుకున్నారు. కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించి హిట్స్ సాధించిన ధనుష్ కూడా ముంబైలో రెండో నివాసం ఏర్పరచుకున్నారు. ఈ ధనుష్, పృథ్వీరాజ్ హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టాలనీ యోచిస్తున్నట్టు సమాచారం.

బావ-బావమరది ప్లాన్...

రామ్ చరణ్ కు 'ట్రిపుల్ ఆర్' మూవీ నార్త్ లోనూ క్రేజ్ సంపాదించి పెట్టింది. అంతకు ముందే 'జంజీర్' రీమేక్ లో రామ్ చరణ్‌, ప్రియాంక చోప్రా వంటి గ్లోబల్ స్టార్ తో కలసి నటించారు... ఆ సినిమా పరాజయం పాలయినా, 'ట్రిపుల్ ఆర్' కారణంగా చెర్రీకి ఉత్తరాదిన సైతం మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అందువల్లే తన 'పెద్ది' సినిమా ప్రచార పర్వాన్ని ముంబైలోనే ఆరంభించారు. చెర్రీ కూడా ముంబైలో తనకు తగిన లగ్జరీ ఫ్లాట్ ను ఖార్ బంద్రా ఏరియాలో సొంతం చేసుకున్నారు... ఇక 'పుష్ప' సిరీస్ తో ఆల్ ఇండియాలోనూ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఆయన హీరోగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న 'రాకా' చిత్రం ముంబైలోనే షూటింగ్ జరుపుకుంటోంది. ఆ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రూపొందిస్తున్నారు. ఇందులో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కూడా నటిస్తారని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బన్నీ ముంబైలో 5 బెడ్ రూమ్స్ ఉన్న అధునాతనమైన పెంట్ హౌస్ ను జుహూ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నారు. చెర్రీ, బన్నీ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్ డమ్ పైనే కాదు ఇంటర్నేషనల్ గానూ గుర్తింపు పొందే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది.

ఆ రూటులో... మరెందరో...

సౌత్ స్టార్స్ లో తెలుగేతరులకు కూడా ముంబై మీద మోజు కలగడానికి మన టాలీవుడ్ స్టార్స్ కారణమని చెప్పొచ్చు... ప్రస్తుతానికి అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ ముంబైలో మరో మకాం పెట్టుకున్నారు. వీరిద్దరి లాగే నార్త్ లో ఎంతో క్రేజ్ ఉన్న ప్రభాస్, జూనియర్ యన్టీఆర్ కూడా అదే తీరున సాగవచ్చనీ తెలుస్తోంది. ఇక అక్కడి అమ్మాయి నమ్రతా శిరోద్కర్ ను మనువాడిన మహేశ్ బాబు కూడా ఖచ్చితంగా ముంబైని సెకండ్ బేస్ గా చేసుకొనే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది... ఇప్పటి దాకా టాలీవుడ్ సూపర్ స్టార్ గానే ఉన్న మహేశ్ బాబు రాబోయే రాజమౌళి 'వారణాసి' తరువాత ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతారనీ అంటున్నారు సినీజనం. అదే జరిగితే మహేశ్ కూడా తరువాతి సినిమాల కోసమైనా ముంబైలో మకాం పెట్టాల్సిందే. ఆ తరువాత ఈ దారిలో ఇంకా ఎంతమంది సౌత్ స్టార్స్ సాగుతారో చూద్దాం.

Updated Date - Aug 25 , 2026 | 09:55 AM