‘ఈసారి కొడుతున్నారు సార్’ అని మహేశ్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ మెసేజ్ చేశారు
ABN, Publish Date - Aug 12 , 2026 | 09:14 AM
‘అగధ’ టీజర్, ట్రైలర్ చూసిన మహేశ్ బాబు ‘ఈసారి కొడుతున్నారు సార్’ అని మెసేజ్ చేశారని దర్శకుడు ఎం.ఎస్. రాజు తెలిపారు. ప్రభాస్ కూడా ‘కొడుతున్నావ్ బావ’ అన్నారని చెప్పారు.
సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు (MS Raju) తెరకెక్కించిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’(Agadha)పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భానుచందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎం.ఎస్. రాజు మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు.
‘అగధ’ అంటే లోతైన అంశం, ఓ శూన్యం అనే అర్థం వస్తుందని ఎం.ఎస్. రాజు తెలిపారు. దేవుడిని, దుష్టశక్తులను మనం కళ్లతో చూడలేమని, అలాంటి శక్తుల మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ అని చెప్పారు. ‘ప్రస్తుతం సినిమాకు ఓపెనింగ్స్ తీసుకొచ్చేది యూత్, మాస్ ఆడియెన్స్. ఆ తర్వాత మౌత్ టాక్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వస్తారు. ‘అగధ’లో కేవలం హారర్, భయపెట్టే అంశాలు మాత్రమే ఉండవు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉంటాయి’ అని దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే ఓ దుష్టశక్తిని ‘అగధ’లో చూపించినట్లు ఆయన చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేసినట్లు ఎం.ఎస్. రాజు తెలిపారు. పలు ప్రాంతాల్లో తిరిగి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. తాను చూసిన వాస్తవ సంఘటనలకు తన ఫాంటసీని జోడించి మంచి సినిమాటిక్ అనుభూతిని అందించేలా ‘అగధ’ను తెరకెక్కించినట్లు వివరించారు. ‘ఇదొక ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా అందరినీ రంజింపజేసేలా రూపొందించాను. సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులతో పాటు మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకోవాలనుకున్నాను. ఈ చిత్రాన్ని ఎంతో నిజాయితీతో తెరకెక్కించాను’ అని అన్నారు.
‘అగధ’పై తనకు చాలా నమ్మకం ఉందని ఎం.ఎస్. రాజు చెప్పారు. ఇప్పటివరకు ఏ సినిమాకూ స్టేజ్‌పై ఇంత ఓపెన్‌గా సినిమా బాగుందని చెప్పలేదని, కానీ ‘అగధ’ చూసిన తర్వాత విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగిందని తెలిపారు. ‘అగధ’ చూసిన తర్వాత సినిమా బాగుంది, విజయం సాధిస్తుందని నా మనసుకు అనిపించింది. అదే విషయాన్ని చెప్పాను. సినిమా చూసిన తర్వాత అందరూ బాగుందని చెబుతారనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘అగధ’ టీజర్, ట్రైలర్ చూసి హీరో మహేశ్ బాబు తనకు వాయిస్ మెసేజ్ పంపారని ఎం.ఎస్. రాజు తెలిపారు.
‘ఈసారి కొడుతున్నారు సార్’’ అని మహేశ్ బాబు (Mahesh Babu) అన్నారని చెప్పారు. అలాగే హీరో ప్రభాస్ (Prabhas) ‘కొడుతున్నావ్ బావ’ అంటూ మెసేజ్ చేశారని వెల్లడించారు. తన హీరోల అభిమానులు ఎప్పుడూ తనకు మద్దతుగా నిలుస్తారని ఎం.ఎస్. రాజు అన్నారు.
ఇకపై నిర్మాణం కంటే కథపైనే ఫోకస్
ఇక సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడతానని ఎం.ఎస్. రాజు తెలిపారు. తనకు పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతే తదుపరి పనికి వెళ్తానని చెప్పారు. సినిమా కోసం ప్రతి క్రాఫ్ట్‌ను దగ్గరుండి పరిశీలించినట్లు వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన అగధ టీజర్, ట్రైలర్‌ను చూస్తే వీఎఫ్‌ఎక్స్ వర్క్ స్థాయి అర్థమవుతుందని, సినిమాలో అంతకు మించిన విజువల్స్ ఉంటాయని చెప్పారు. ఇకపై కథ, స్క్రీన్‌ప్లే, రైటింగ్, మేకింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థిక విషయాల జోలికి వెళ్లకుండా కథపై ఫోకస్ చేస్తున్నానని చెప్పారు. ‘డర్టీ హరి’, ‘అగధ’ సినిమాల విషయంలో తన స్నేహితులు ముందుకు వచ్చి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని, దీంతో తనపై ఆర్థిక భారం తగ్గిందని తెలిపారు.
ఎన్టీఆర్ వ్యాఖ్యలపై వివరణ
ఎన్టీ రామారావు గురించి తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంపై ఎం.ఎస్. రాజు వివరణ ఇచ్చారు. ‘అగధ’ కోసం తాను ఉదయం మూడు గంటలకే నిద్రలేచి పని చేసేవాడినని, ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని పనిచేశానని చెప్పే క్రమంలో సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశానని తెలిపారు. ఎన్టీఆర్‌పై తనకు అపారమైన అభిమానం ఉందని, ఆయన క్రమశిక్షణ, నిబద్ధతను దగ్గరగా చూసినట్లు చెప్పారు. తన తండ్రికి ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉందని, ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చినా ఎన్నికల కారణంగా చివరి నిమిషంలో ఆ అవకాశం మిస్ అయిందని ఎం.ఎస్. రాజు గుర్తుచేసుకున్నారు.
‘అగధ 2’పై త్వరలో క్లారిటీ
‘అగధ’ను మొదట ఎవరికీ ఇవ్వకూడదని అనుకున్నామని ఎం.ఎస్. రాజు తెలిపారు. అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత పలువురు సంప్రదించారని చెప్పారు. కన్నడ నుంచి హోంబలే టీమ్, గీతా ఆర్ట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొందరు సినిమా గురించి సంప్రదించినట్లు వెల్లడించారు. ముందుగా తెలుగులో సినిమా విడుదల చేసిన తర్వాత మిగతా భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అన్ని భాషలకు డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. సినిమా విడుదలైన 60 రోజుల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ‘అగధ’కు ప్రీక్వెల్ లేదా సీక్వెల్ తీసే అవకాశం ఉందని ఎం.ఎస్. రాజు తెలిపారు. సినిమా విడుదలైన తర్వాత ప్రీక్వెల్ చేస్తారా? సీక్వెల్ తెరకెక్కిస్తారా? అనే విషయాన్ని వెల్లడిస్తానన్నారు. ‘అగధ’కు ఆ స్కోప్ ఉంది. ఇది మిస్టిక్ డివైన్ థ్రిల్లర్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది’ అని ఎం.ఎస్. రాజు తెలిపారు.