సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Balakrishna: హాట్ కేక్ బాల‌య్య‌.. బాలకృష్ణ కోసం డైరెక్టర్ల‌ ఉత్సాహం

ABN, Publish Date - Feb 05 , 2026 | 07:13 PM

నటసింహ బాలకృష్ణతో సినిమాలు రూపొందించాలని యంగ్ డైరెక్టర్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య హీరోగా ఓ మూవీ రూపొందనుంది. ఈ సినిమా తరువాతి ప్రాజెక్ట్ కోసం పలువురు డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి.

Balakrishna

బాలకృష్ణ (Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న చిత్రం మార్చి 19వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ లోగా గోపీచంద్ తన స్క్రిప్ట్ ను మరింత పటిష్టం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. యాక్షన్ డ్రామాలో ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఈ మూవీ రూపొందనుంది. ఈ చిత్రం తరువాత బాలయ్య నటించే సినిమా ఏది అన్న అంశంపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య హీరోగా మళయాళ చిత్రం 'మార్కో' డైరెక్టర్ హనీఫ్ అదేని (Haneef Adeni) డైరెక్షన్‌లో దిల్ రాజు (Dil Raju) ఓ సినిమా నిర్మించనున్నారని టాక్.

తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలోనూ బాలయ్య ఓ సినిమా చేస్తారనీ వినికిడి. 'బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి' చిత్రాలు రూపొందించిన వివేక్ ఆత్రేయ కూడా బాలయ్య కోసం ఓ సబ్జెక్ట్ తయారు చేశారని, దానిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తారనీ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అలాగే బాలయ్యతో 'డాకూ మహరాజ్' నిర్మించిన సూర్యదేవర నాగవంశీ కూడా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తారనీ సమాచారం. ఇలా బాలయ్య చుట్టూ నలుగురు దర్శకుల పేర్లు సందడి చేస్తున్నాయి.

బాలకృష్ణతో దర్శకులు పనిచేయడానికి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే బాలయ్య ఒక్కసారి సబ్జెక్ట్ విని ఓకే చెప్పిన తరువాత, మేకింగ్ టైమ్ లో ఏలాంటి మార్పులూ చేర్పులకు అవకాశం ఇవ్వరు. అంతేకాదు, సబ్జెక్ట్ విషయంలో ఆ పై ఆయన ఏలాంటి జోక్యం చేసుకోరు. అలా బాలయ్య దగ్గర దర్శకులకు ఫ్రీడమ్ లభిస్తుందని అందరూ అంటూ ఉంటారు. అందువల్లే బాలయ్యతో పనిచేయడానికి డైరెక్టర్స్ ఆసక్తి చూపిస్తూంటారు. ప్రస్తుతం బాలయ్యతో సినిమాలు తీయడానికి ఉత్సాహం చూపిస్తున్న వారెవరు? అంటే వివేక్ ఆత్రేయ, హరీశ్ శంకర్, కొరటాల శివ, మళయాళ డైరెక్టర్ హనీఫ్ అని వినిపిస్తోంది.

వీరందరూ ఇప్పటి దాకా బాలయ్యతో సినిమాలు తీయనివారే. కాబట్టి, బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా కథను రూపొందించి అలరించడానికి వీరు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం అటు బాలయ్యకు, ఇటు గోపీకి కూడా అత్యంత కీలకంగా మారింది. వరుస విజయాలతో సాగుతోన్న బాలయ్యకు 'అఖండ-2' ద్వారా ఆశించిన ఫలితం దక్కలేదు. అలాగే గోపీచంద్ హిందీలో రూపొందించిన 'ఝాట్' ఏ మాత్రం అలరించలేక పోయింది.

ఈ నేపథ్యంలో ప్రయోగాలకు వెళ్ళకుండా, అందరినీ ఆకట్టుకొనేలా ఓ ఫ్యామిలీ డ్రామాకు యాక్షన్, సెంటిమెంట్ మిళితం చేసి సేఫ్ ప్రాజెక్ట్ ను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఉగాది నుండి ఈ సినిమా షూటింగ్ సాగనుంది. త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి దసరా కానుకగా రిలీజ్ చేయాలని సంకల్పించారు. పైగా ఇందులో వీఎఫ్ఎక్స్ వర్క్ అంతగా లేకపోవడంతో, అనుకున్న సమయానికే సినిమా పూర్తవుతుందనీ పరిశీలకులు చెబుతున్నారు. మరి బాలయ్య-గోపీచంద్ మూవీ ఎప్పుడు వస్తుందో? ఆ తరువాత బాలకృష్ణ హీరోగా ఏ సినిమా పట్టాలెక్కుతుందో చూడాలి.

Updated Date - Feb 05 , 2026 | 07:44 PM