Mosapoyam Janaki: ఆసక్తికరంగా 'మోసపోయాం జానకి'
ABN, Publish Date - Nov 15 , 2026 | 04:09 PM
సాయి సోహన్, విస్మయ శ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నూతన చిత్రానికి ‘మోసపోయాం జానకి’ (Mosapoyam Janaki) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
టాలీవుడ్‌లో మరో క్రైమ్ కామెడీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సాయి సోహన్, విస్మయ శ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నూతన చిత్రానికి ‘మోసపోయాం జానకి’ (Mosapoyam Janaki) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించి పోస్టర్‌ను విడుదల చేసింది. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మధుసూధన్ రెడ్డి గోపు దర్శకత్వం వహిస్తున్నారు.
డిఫరెంట్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌లో ముగ్గురు యువకులు డబ్బు సంచులతో అంబాసిడర్ కారు వైపు వెళ్తున్నట్లు చూపించారు. అంతేకాకుండా, ప్రభుత్వం రద్దు చేసిన పాత కరెన్సీ నోట్లు ఆ సంచుల నుంచి కిందపడటం కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే డబ్బు చుట్టూ జరిగే మోసాలు, వాటి వల్ల ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది.
క్రైమ్, కామెడీ అంశాలను మేళవించి ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు ఓయ్, నరేంద్ర రవి, అజయ్, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్, మాణిక్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.