Mohan Babu: వారికి డైరెక్టర్ అనే పదానికి అర్ధం కూడా తెలియదు
ABN , Publish Date - May 05 , 2026 | 01:47 PM
సినీతండ్రి దాసరి నారాయణరావు లేకపోతే తాను లేనని మోహన్ బాబు (Mohan Babu అన్నారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని డైరెక్టర్స్ డేని జరుపుకున్నారు.
Mohan Babu: సినీతండ్రి దాసరి నారాయణరావు లేకపోతే తాను లేనని మోహన్ బాబు (Mohan Babu అన్నారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని డైరెక్టర్స్ డేని జరుపుకున్నారు. సోమవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ వేడుక ఘనంగా జరిగింది. డైరెక్టర్స్ డే 2026 కార్యక్రమానికి సీనియర్ కథానాయికలు జయసుధ, జయప్రద, నటుడు మోహన్ బాబు, బాబు మోహన్ తదితరులు హాజరయ్యారు.
డైరెక్టర్స్ డే వేడుకలో మోహన్ బాబు.. దాసరి నారాయణరావును తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ' ఈరోజు ఆనందింపచేసే రోజు కాదు.. చాలా బాధాకరమైన రోజు. ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నామే కానీ, తండ్రిలాంటి వ్యక్తి పోయారు అనే బాధ జీవితాంతం ఉంటుంది నాకు. ఎక్కడ ఉండేవాడిని, ఎలా ఉండేవాడిని.. మోహన్ బాబు అనే పేరు మార్చి ఇండస్ట్రీకి తీసుకొచ్చి.. ఒక విలన్ గా, ఒక కమెడియన్ గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఒక హీరోగా.. అవును, నేను మోహన్ బాబు.. డైలాగ్ ఇలా చెప్పాలి అని నాకు నేర్పించిన సినీతండ్రి, మా గురువు గారు దాసరి నారాయణరావు.
దాసరి గురించి చెప్పాలంటే ఒక పుస్తకం అని చెప్పొచ్చు. ఇక్కడకి వచ్చి అవార్డులు తీసుకున్నవాళ్ళకు శుభాకాంక్షలు. ఈ జనరేషన్ లో చాలామందికి డైరెక్టర్ అనే పదానికి అర్ధం తెలీదు. దర్శకుడు అనే పదానికి అర్ధం చెప్పిన ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని' తెలిపారు. అంతేకాకుండా డైరెక్టర్స్ డే రోజున.. డైరెక్టర్ అసోసియేషన్ కి మోహన్ బాబు రూ. 15 లక్షలు విరాళంగాఅందించారు. డబ్బులు ఇచ్చానని తనకు అవార్డులు ఇవ్వడం లాంటివి ఏం చేయొద్దని, ఇది కేవలం దాసరి మీద ఉన్న గౌరవంతోనే చేస్తున్నట్లు మోహన్ బాబు తెలిపారు.