Mohan Babu: డైరెక్టర్స్ డే.. దర్శకుల సంఘానికి రూ.15 లక్షల విరాళం..

ABN , Publish Date - May 05 , 2026 | 12:58 PM

దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టిన రోజును ‘డైరెక్టర్స్‌ డే’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించినప్పటి నుంచీ  దర్శకుల సంఘం ప్రతి ఏటా మే 4న ‘డైరెక్టర్స్‌ డే’గా సెలబ్రేట్‌ చేస్తున్నారు.

Dasari Narayana Rao - Directors Day

దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టిన రోజును ‘డైరెక్టర్స్‌ డే’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించినప్పటి నుంచీ  దర్శకుల సంఘం ప్రతి ఏటా మే 4న ‘డైరెక్టర్స్‌ డే’గా సెలబ్రేట్‌ చేస్తున్నారు. కలయిక ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం శిల్పకళా వేదికలో జరిగిన ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎందరో దర్శకులను. సినీ ప్రముఖులను సత్కరించారు. బాలీవుడ్‌ దర్శకుడు ఆర్‌.బాల్కీని దాసరి మెమోరియల్‌ నేషనల్‌ అవార్డుతో సత్కరించారు.

ఈ సందర్భంగా నటుడు మోహన్‌బాబు దర్శకుల సంఘానికి రూ.15 లక్షలు బహుమతిగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘తండ్రిలాంటి దాసరి గారు లేరనే లోటు నాకు ఈ జీవితాంతం ఉంటుంది. ఓ సాధారణ వ్యక్తిని తీసుకు వచ్చి మోహన్‌ బాబుగా మార్చారు. బాలీవుడ్‌ దర్శకుడు బాల్కికి ఈ అవార్డుని ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ జనరేషన్‌కు డైరెక్టర్‌ అనే పదానికి అర్థం తెలియదు. దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావు. చిత్రసీమ ఉన్నంత వరకు దాసరి పేరు చిరస్థ్థాయిగా నిలుస్తుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శకులంతా కలిసి ఇలాంటి ఈవెంట్‌ నిర్వహిస్తుండటం మంచి పరిణామం. ఈ అవార్డుల్ని ఎంచుకున్న, ఇచ్చిన తీరు అద్భుతంగా ఉంది. మా యూనివర్సిటీలో అక్కయ్య గారి పేరు మీద గోల్డ్‌ మెడల్స్‌ ఇస్తుంటాను. దాసరి జ్ఞాపకంగా యూనివర్శిటీలో ఓ ఆడిటోరియం కట్టాం. తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ చేస్తున్న కార్యక్రమాలకి రూ.15 లక్షల విరాళాన్ని అందిస్తాను’ అని అన్నారు.


Balki.jpg

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ 'దాసరి మన అందరినీ అనాథలను చేసి వెళ్లిపోయారు. కె. విశ్వనాథ్ గారి సలహా తో మే 4న దాసరి గారి పుట్టిన రోజుని డైరెక్టర్స్ డే గా నిర్వహిస్తున్నాం. ఓ డైరెక్టర్ 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం, 250కి పైగా చిత్రాలకు మాటలు రాయడం, ఐదారు వందల పాటలు రాయడం మామూలు విషయం కాదు. 50 చిత్రాలపైకు పైగా నిర్మించారు, ఎన్నో గొప్ప పాత్రల్ని పోషించారు, ‘ఉదయం’ పేపర్‌ను కూడా ప్రారంభించారు. ఆయన మేధస్సు చాలా గొప్పది. ఇన్ని  పనుల మధ్య సేవా కార్యక్రమాలు, కార్మికుల సమస్యల్ని తీర్చేవారు. ఆయన అంతటి గొప్పవారు కాబట్టే ఆయన బర్త్ డేకి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు' అని అన్నారు.

Updated Date - May 05 , 2026 | 02:20 PM