నెట్‌ఫ్లిక్స్ వేదికగా చిరంజీవి అన్‌ఫిల్టర్డ్ స్టోరీస్..
ABN, Publish Date - Sep 28 , 2026 | 06:23 PM
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఆయన ఒక ప్రత్యేకమైన పాడ్‌కాస్ట్ ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఆయన ఒక ప్రత్యేకమైన పాడ్‌కాస్ట్ ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నారు. గత కొన్నిరోజులు క్రితం చిరు జీవిత కథ ఆధారంగా డాక్యుమెంటరీ తీయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే డాక్యుమెంటరీ కన్నా పాడ్‌కాస్ట్ అయితే తన జీవిత అనుభవాలను, మధుర జ్ఞాపకాలను మరింత నిజాయితీగా, ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా పంచుకోవడానికి సరైన వేదిక అని చిరంజీవి భావించినట్లు తెలుస్తోంది.
ఈ సరికొత్త ఐడియా వెనుక చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి ఉన్నారట. వారు తీసుకొచ్చిన ఈ పాడ్‌కాస్ట్ కాన్సెప్ట్ మెగాస్టార్‌కు బాగా నచ్చడంతో ఆయన వెంటనే దీనికి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన నట ప్రయాణంలో ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలను ఆయన ఈ పాడ్‌కాస్ట్ లో అభిమానులతో పంచుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరు అభిమానులకు ఇది ఒక అరుదైన గిఫ్ట్‌గా నిలవనుంది. మొన్నటివరకు నెట్ ఫ్లిక్స్ తో ఈ డీల్ గురించి చర్చలు జరిగాయని, చివరకు ఈ డీల్ కి చిరు ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది.
ఇదిలా ఉంటే, చిరంజీవి వెండితెరపై కూడా వరుస భారీ చిత్రాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న కాకా సినిమా ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన గ్రాండ్ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర షూటింగ్‌ను చిరంజీవి పూర్తి చేశారు. ఈ విజువల్ వండర్ సినిమాకు సంబంధించిన అన్ని రకాల బిజినెస్ డీల్స్ పూర్తయ్యాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారని సమాచారం. ఒకవైపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో నెట్‌ఫ్లిక్స్ పాడ్‌కాస్ట్, మరోవైపు కాకా, విశ్వంభర సినిమాలతో మెగాస్టార్ తన జోరును ప్రదర్శిస్తున్నారు. మరి చిరు పాడ్‌కాస్ట్ కి ఎలాంటి టైటిల్ పెడతారో చూడాలి.