సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డు: అన్నగారి పురస్కారం అన్నయ్యకు..

ABN, Publish Date - Mar 19 , 2026 | 10:48 PM

కళాకారులు గౌరవించబడిన రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నానుడి. దానిని సరిగ్గా అర్థం చేసుకుని, ఒక సమయంలో కుంటుపడిన అవార్డులను గౌరవించి ముఖ్యమంత్రి పునరుద్దించి ఈ వేడుక మళ్లీ మొదలుపెట్టారు.


‘కళాకారులు గౌరవించబడిన రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నానుడి. దానిని సరిగ్గా అర్థం చేసుకుని, ఒక సమయంలో కుంటుపడిన అవార్డులను గౌరవించి ముఖ్యమంత్రి పునరుద్దించి ఈ వేడుక మళ్లీ మొదలుపెట్టారు. సినిమాకు ఎంతో దగ్గరగా ఉండే ఆంధ్రప్రదేశ్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు కూడా ఆలోచించి ఏపీలో అవార్డులను పునరుద్దరించాలని కోరుకుంటున్నాను’ అని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)అన్నారు.

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డు (Gaddar film award) రెండో ఎడిషన్‌ ఉగాది సందర్భంగా హైటెక్స్‌ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. 2025కు సంబంధించి సినీ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు పురస్కార ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం అనుముల రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దిల్‌రాజు, నాగచైతన్య తదితరులు పాల్గొన్నారు. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌  పొందిన చిత్రాలకు పురస్కారాలను ప్రకటించారు. ఈ ఏడాది చిన్న చిత్రాలకు అవార్డుల పంట పండింది. ఉగాది సందర్భంగా గురువారం అవార్డులను అందజేశారు. ప్రత్యేక కేటగిరీ పురస్కారం ఎన్టీఆర్‌ జాతీయ అవార్డును చిరంజీవిని వరించింది. ఈ అవార్డును ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, బాలీవుడ్‌ సీనియర్‌ నటి మాధురీ దీక్షిత్‌ అవార్డును, ప్రశంస పత్రాన్ని, పది లక్షల రూపాయల నగదు బహుమతిని చిరంజీవికి అందించారు. పైడి జయరాజ్‌ అవార్డు కమల్‌హాసన్‌కు, బీఎన్‌రెడ్డి ఫిల్మ్‌ అవార్డును సింగీతం శ్రీనివాసరావు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్వనీ దత్‌కు అందజేశారు.

సుద్దాల అశోక్‌తేజ సి.నారాయణరెడ్డి ఫిల్మ్‌ అవార్డు అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్‌ అవార్డు సహజనటి జయసుధ, కె.ఎల్‌.కాంతారావు ఫిల్మ్‌ అవార్డు ఆర్‌ నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డు నిర్మాత రమేశ్‌ ప్రసాద్‌కు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్‌), ఉత్తమ నటిగా రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్‌), ఉత్తమ దర్శకుడిగా సాయిలు (రాజు వెడ్స్‌ రాంబాయి) తదితరులు సీఎం నుంచి అవార్డులు అందుకున్నారు.

బెస్ట్‌ స్క్రీన్‌ప్లే రైటర్‌గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి గాను  దర్శకుడు అనిల్‌ రావిపూడి, బెస్ట్‌ స్టోరీ రైటర్‌గా గుణ శేఖర్‌ (యుఫోరియా), ఉత్తమ బాలనటుడిగా రోహన్‌ (ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో), ఉత్తమ హాస్యనటుడిగా కృష్ణతేజ్‌రెడ్డి (జిగ్రీస్‌), ఉత్తమ గేయ రచయితగా నందకిశోర్‌ (నా కొడుకా- కుబేర సినిమా), నాగార్జున చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 



చిరంజీవి మాట్లాడుతూ
‘ఈ అవార్డు వేడుక జరగడానికి మూలవిరాట్‌ రేవంత్‌రెడ్డి. కళాకారులు గౌరవించబడిన రాజ్యం, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని నానుడి. దానిని సరిగ్గా అర్థం చేసుకుని, ఒక సమయంలో కుంటుపడిన అవార్డులను గౌరవించి ముఖ్యమంత్రి పునరుద్దించి గద్దర్‌ అవార్డు వేడుకను మొదలుపెట్టారు. ఆయనను కలిసిన ప్రతిసారీ సినిమా అభివృద్ధి గురించే మాట్లాడతారు. భారతదేశ సినిమాకు హైదరాబాద్‌ కేరాఫ్‌గా నిలపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సినిమాకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యానికి మనమంతా రుణపడి ఉండాలి. ఇదే అవార్డులు ఆంధ్రాలో కూడా పునరుద్దించాలని, సినిమా ఇండస్ట్రీకి ఎంతో దగ్గరగా ఉండే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచన చేసి, ప్రోత్సహించాలని.. అదే జరిగితే ఎంతోమంది యంగ్‌స్టర్స్‌ వచ్చి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తారు. స్టేట్‌ ఎకనామీ కూడా పెరుగుతుంది. ఈ అవార్డుల ఎంపిక సీనియర్స్‌కు గౌరవాన్నిచేలా, యంగ్‌స్టర్‌ని ఉత్సాహపరిచేలా ఉందని అన్నారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
‘అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు సినిమా కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా దేశానికే తలమానికం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారు. గత ఏడాది పదేళ్లగా పెండింగ్‌లో ఉన్న అవార్డులను ప్రదానం చేశారు. మన సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తెలుగు సినిమాల్లో అనేక రుగ్మతలను చూపిస్తున్నాయి. గతంలో వచ్చిన సత్యహరిశ్చంద్ర, దానవీరశూరకర్ణ; మరో చరిత్ర. రోజులు మారాయి వంటి చిత్రాలు సమాజానికి ఎన్నో రకాలుగా సందేశాలిచ్చాయి. గద్దర్‌ గొప్ప కళాకారుడు.ఆయన పేరుతో అవార్డును పెట్టి కళాకారులకు అందజేయడం ఆనందంగా ఉంది’ అన్నారు.

 

Updated Date - Mar 19 , 2026 | 11:17 PM