నారాయణరావు పార్దీవ దేహానికి.. మెగాస్టార్ చిరంజీవి నివాళులు
ABN, Publish Date - Aug 28 , 2026 | 10:23 AM
నటుడు నిర్మాత జివి నారాయణరావు పార్దీవ దేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు.
తెలుగు సినీ, రంగస్థల నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు (GV NarayanaRao) మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఉంచిన ఆయన పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారాయణరావుతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు.
ఇటీవలే నారాయణ రావు నా దగ్గరకు వచ్చి చాలా రోజుల తర్వాత మంచు పల్లకి ఇన్‌స్పిరేషన్‌తో ఐదుగురు కుర్రవాళ్లు.. పెద్దవాళ్లు అయితే ఎలా ఉంటారో అనే కథతో ఒక సినిమా చేశాను ట్రైలర్ లాంచ్ చేయాలి. మీ సహకారం ఉంటే అందరికీ బాగుంటుంది’’ అని అన్నారు. కచ్చితంగా చేస్తానని చెప్పాను. ఆ క్షణంలో ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగుదాం రమ్మని అడిగారు. బహుశా తన ఆఖరి చిత్రం అదేనేమో. ఆ సమయంలో చాలా సేపు మాట్లాడుకున్నాము. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలని చెప్పాను. ఆ క్షణంలో తనకి ఆల్ ది బెస్ట్ చెప్పాను. కానీ అదే మాట శాశ్వతంగా గుడ్‌బై అవుతుందని అనుకోలేదన్నారు.
ఇంకా చిరంజీవి మాట్లాడుతూ.. నారాయణరావు మరణ వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని, "నారాయణరావు లేరు అనే విషయాన్ని అంగీకరించడం చాలా కష్టంగా ఉందన్నారు. 1977 నుంచే ఆయనతో నాకు పరిచయం ఉంది. నేను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న రోజులలో ఆయన సీనియర్ స్టూడెంట్‌గా మా క్లాసులకు వచ్చేవారు. అప్పటి నుంచి మా మధ్య మంచి అనుబంధం కొనసాగింది" అని తెలిపారు. నారాయణరావు వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ "ఆయన చాలా మొండి మనిషి. ఏ పని అనుకున్నా దాన్ని పూర్తి చేసేంత పట్టుదల ఉండేది. . సినీ రంగంపై ఆయనకున్న ప్రేమ, అంకితభావం ప్రత్యేకమైనవి" అని చిరంజీవి పేర్కొన్నారు. అనంతరం నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా నటులు ప్రసాద్ బాబు, నరసింహరాజు, నిర్మాత దామోదర్ ప్రసాద్ తదితరులు కూడా మహాప్రస్థానానికి చేరుకుని జి.వి. నారాయణరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కాగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో మధ్యాహ్నం మహాప్రస్థానం (Maha Prasthanam) లో జి.వి. నారాయణరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలుగు సినీ రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన ఈ విలక్షణ నటుడి మరణం పరిశ్రమకు తీరని లోటుగా సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు.