మెగావర్స్.. చిరు వర్సెస్ కమల్.. ఇది కదా కావాల్సింది
ABN, Publish Date - Oct 28 , 2026 | 04:07 PM
ఇండస్ట్రీలో ఇప్పుడంతా డిజిటల్ ఎంట్రీ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు సినిమాలు ఏమి లేనప్పుడు స్టార్స్ బుల్లితెరపై అడుగుపెట్టేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. బుల్లితెరపై అడుగుపెట్టడంతోనే మరింత హైప్ తెచ్చుకుంటున్నారు.
ఇండస్ట్రీలో ఇప్పుడంతా డిజిటల్ ఎంట్రీ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు సినిమాలు ఏమి లేనప్పుడు స్టార్స్ బుల్లితెరపై అడుగుపెట్టేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. బుల్లితెరపై అడుగుపెట్టడంతోనే మరింత హైప్ తెచ్చుకుంటున్నారు. హోస్ట్ లుగా మారి ప్రతి కుటుంబానికి మరింత దగ్గరవుతున్నారు. బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్', సమంత 'సామ్ జామ్', రానా 'నెం 1 యారి', జగపతి బాబు 'జయమ్ము నిశ్చయమ్మురా' లాంటి టాక్ షోస్ తో అభిమానులను అలరించారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అదే బాటలో నడుస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న 'మెగావర్స్' (MEGAVerse) టాక్ షో ద్వారా చిరంజీవి డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే బ్రహ్మానందం, సునీల్, సత్యలతో అన్నపూర్ణ స్టూడియోస్‌లో తొలి ఎపిసోడ్ షూటింగ్ విజయవంతంగా పూర్తి కాగా, తాజాగా ఈ షో కోసం కమల్ హాసన్‌తో ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు ఫిలింనగర్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే, దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే వేదికపై ముచ్చటించుకోవడం అభిమానులకు కన్నుల పండువగా మారనుంది. 1979లో కే. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఇది కథ కాదు చిత్రంలో మాత్రమే ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి నటించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ కలయిక బిగ్ స్క్రీన్ పై కాకపోయినా, ఓటీటీ వేదికగా సాధ్యం కానుందనే వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఈ వార్త తెలియడంతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఒక సైడ్ చిరు.. ఇంకో సైడ్ కమల్.. ఇది కదా కావాల్సింది. దాదాపు 47 ఏళ్ల తరువాత వీరిద్దరూ ఒకే వేదికపై తమ జ్ఞాపకాలను పంచుకుంటుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.ఇప్పుడు చిరంజీవి హోస్ట్ చేయబోతున్న ఈ మెగావర్స్ తొలి సీజన్లో మొత్తం 15 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఒక్కో ఎపిసోడ్ లో ఇలాంటి కాంబోలను సెట్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు చిరుతో సందడి చేయడానికి ఏ స్టార్స్ దిగుతారో చూడాలి.