Meenakshi Chaudhary: కంఫర్ట్ జోన్ దాటాలనుకుంటున్నా.. మనసులో మాట చెప్పిన మీనాక్షి
ABN , Publish Date - Nov 28 , 2026 | 08:39 AM
లక్కీ భాస్కర్’ సినిమా తర్వాత నాకు చాలా మంది మదర్ రోల్స్ ఆఫర్ చేశారు. అయితే ఇప్పటికే అలాంటి పాత్రలో నటించాను కాబట్టి మళ్లీ అవే తరహా పాత్రలు చేయాలని అనుకోవడం లేదు.
‘లక్కీ భాస్కర్’ (lucky Bhaskar) సినిమా తర్వాత నాకు చాలా మంది మదర్ రోల్స్ ఆఫర్ చేశారు. అయితే ఇప్పటికే అలాంటి పాత్రలో నటించాను కాబట్టి మళ్లీ అవే తరహా పాత్రలు చేయాలని అనుకోవడం లేదు. నా కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చి విభిన్నమైన పాత్రలతో నటిగా నన్ను నేను నిరూపించుకోవాలన్నదే నా లక్ష్యం" అని మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) అన్నారు. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న మూవీ ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకుడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. డిసెంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో దక్ష అనే కీలక పాత్రలో నటిస్తున్న మీనాక్షి చౌదరి తాజాగా విలేకరులతో ముచ్చటించారు.
దక్ష పాత్ర ఎంతో ప్రత్యేకం..
దర్శకుడు కార్తీక్ దక్ష పాత్రను అనుకున్నప్పుడే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను డిజైన్ చేశారు. కథ చెప్పే సమయంలోనే ఈ పాత్రను ఎలా చేయాలనే విషయంపై చాలా చర్చించుకున్నాం. ఆయన ఈ పాత్ర కోసం ఎలాంటి లక్షణాలు అనుకున్నారో, అలాంటి పాత్రకు నన్ను ఎందుకు ఎంపిక చేశారో నాకు స్పష్టత వచ్చింది. దక్ష చాలా ఫోకస్డ్గా ఉండే అమ్మాయి. తనకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆర్కియాలజీలో థీసిస్ చేస్తుంటుంది. ఈ పాత్ర ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మంచి క్యారెక్టర్ గ్రాఫ్ ఉంది. దీనికి పూర్తి క్రెడిట్ కార్తీక్ గారికే దక్కుతుంది.
నాగచైతన్యతో వర్క్‌షాప్..
కథ విన్న తర్వాత నాగచైతన్య గారితో కలిసి రెండు రోజుల పాటు వర్క్‌షాప్ చేశాం. దర్శకుడి విజన్ ఏంటి? దాన్ని ఎలా తెరపైకి తీసుకురావాలి? అనే విషయాలపై స్పష్టత వచ్చింది. ఎన్నో సన్నివేశాలకు రిహార్సల్స్ చేశాం. ఆర్కియాలజీకి సంబంధించిన లోతైన విషయాలను కూడా ఈ సినిమా కోసం తెలుసుకున్నాను. ‘వృషకర్మ’ ప్రపంచం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. హారర్, మైథలాజికల్ జానర్లలో గతంలో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విజువలైజేషన్, ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంటాయి. కార్తీక్ గారి ‘విరూపాక్ష’ కూడా కంటెంట్ బేస్డ్ సినిమానే. దాన్ని ఆయన అద్భుతమైన కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచారు. ‘వృషకర్మ’ కూడా బలమైన కథతో పాటు కమర్షియల్ అంశాలతో ఆకట్టుకుంటుంది. నాగచైతన్యతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం. ఆయన చాలా గ్రౌండెడ్‌గా, హంబుల్‌గా ఉంటారు. అందరితోనూ ఫ్రెండ్లీగా మెలుగుతారు. ఈ సినిమాలో ఎంతోమంది ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేశారు. కియారా పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. సర్ప్ శ్రీవాస్తవ్, జైరామ్ వంటి నటీనటులు అద్భుతమైన ప్రతిభను చూపించారు.
హైట్స్ అంటే చాలా భయం..
ఈ సినిమాలో కొన్ని ఎత్తైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ఉన్నాయి. నిజానికి నాకు హైట్స్ అంటే చాలా భయం. అయినప్పటికీ ఆ సీక్వెన్సులు చేయడం ఛాలెంజింగ్‌గా, అదే సమయంలో ఫన్‌గా అనిపించింది. ధైర్యంగా వాటిని పూర్తి చేశాను. కొన్ని రఫ్ అండ్ టఫ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. సినిమాలో భారీ స్థాయిలో సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. ఇంతకుముందు నేను ఇలాంటి హెవీ గ్రాఫిక్స్ ఉన్న సినిమా చేయలేదు. అందుకే ఇది నాకు కొత్త అనుభవం. ఇందులో పాటలు కథలో భాగంగానే వస్తాయి. ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్ను ప్రతిబింబించేలా సంగీతం ఉంటుంది. ముఖ్యంగా అజనీష్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను థియేటర్లో వినడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
హారర్, థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టం..
చిన్నప్పుడు ఇంట్లో హారర్ సినిమాలు చూపించేవారు కాదు. అలాంటివి చూస్తే పీడకలలు వస్తాయని భయపడేవారు. కానీ పెద్దయ్యాక హారర్ సినిమాలను బాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. హారర్, థ్రిల్లర్, డిటెక్టివ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ‘వృషకర్మ’ అంగీకరించడానికి అది కూడా ఒక కారణం.
ఒకే తరహా పాత్రలు చేయాలని లేదు..
ఒక నటిగా వైవిధ్యమైన పాత్రలు చేయడంపైనే నా దృష్టి ఉంటుంది. కొత్త క్యారెక్టర్స్, కొత్త జానర్లను ప్రయత్నించాలని అనుకుంటాను. రెగ్యులర్‌గా ఒకే తరహా పాత్రలు, కథలు వస్తే వాటిని అంగీకరించను. ‘లక్కీ భాస్కర్’ సినిమా చూసిన తర్వాత చాలామంది మదర్ రోల్స్ ఆఫర్ చేశారు. అయితే ఇప్పటికే అలాంటి పాత్ర చేశాను కాబట్టి వాటిని అంగీకరించలేదు. కథ, పాత్ర కొత్తగా ఉన్నప్పుడే చేయాలనిపిస్తుంది. నా కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చి విభిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను.
తదుపరి ప్రాజెక్టులు..
'వృషకర్మ’కు సీక్వెల్ ఉందా లేదా అనేది సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే, కార్తీతో చేస్తున్న సినిమాలో నా పోర్షన్ ఇప్పటికే 60 శాతం పూర్తయింది. అదొక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్. సిద్ధు జొన్నలగడ్డతో కలిసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నాను. హిందీలోనూ ఓ సినిమా చేస్తున్నాను. త్వరలో వాటి వివరాలను అధికారికంగా వెల్లడిస్తారు. భవిష్యత్తులో ‘మా ఇంటి బంగారం’ తరహాలో పూర్తిస్థాయి యాక్షన్ సినిమా చేయాలని ఉంది.
ALSO READ:
‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’.. కోన వెంకట్, బాబీ పోస్టులతో ఫుల్ క్లారిటీ
హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. డిటైల్స్ ఇవే
మోక్షజ్ఞ ఎంట్రీకి మెగా బ్రేక్.. అసలు కారణం ఇదేనా?