అయ్యో.. హన్సిక! ఫ్రెండ్ భర్తతో పెళ్లి.. మూడేళ్లకే విడాకులు
ABN, Publish Date - Mar 11 , 2026 | 07:18 PM
ప్రముఖ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రముఖ హీరోయిన్ హన్సిక (Hansika Motwani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్, అల్లు అర్జున్ 'దేశ ముదురు' సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలో ఆరేడేళ్ళు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆపై కొత్త నీరు వేగంగా రావడంతో క్రమంగా అవకాశాలు తగ్గాయి. అయితే మొన్నటి వరకూ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలలోనూ చేసింది. ప్రస్తుతం ఈటీవీ తెలుగులో పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా చేస్తోంది.
అయితే.. 2022లో వ్యాపారవేత్త సోహెల్ ఖతురియా (Sohael Khaturiya)ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది హన్సిక. ఆపై అడపా దడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తూ ఎక్కువగా ఇంటికే పరిమితమైంది. కానీ పెళ్లైన మూడేళ్ళ తర్వాత గత సంవత్సరం జూలైలో తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.
హన్సిక అప్పటికే 2016లోనే పెళ్లి చేసుకుని విడిపోయిన తన స్నేహితురాలు రింకీ (Rinky) భర్త సోహెల్ ఖతురియానే ఏరి కోరి ప్రేమించి మరి పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమే అయింది. అయితే కొంతకాలానికే ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఇక కలసి ఉండడం కష్టమని నిర్ణయించుకున్న హన్సిక, సోహెల్ 2024 జూలై నుంచి విడివిడిగా ఉంటున్నారు. హన్సిక అతనితో విడాకులు తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ క్రమంలో.. గత ఏడాది జూలైలో డైవర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన హన్సిక ఆపై ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టు (Bandra Family Court) ను ఆశ్రయించగా, విచారణ జరిపిన కోర్టు తాజాగా ఈ రోజు (మార్చి 11) బుధవారం అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతోనే హన్సిక, సోహెల్ విడిపోయారనీ, భర్త నుంచి హన్సిక ఎటువంటి భరణం కూడా కోరలేదని లాయర్లు మీడియాకు వెల్లడించారు.