Jagapathi Babu: పెద్దికి బ్యాడ్ రివ్యూస్.. రాసిన వారికి మరింత థ్యాంక్స్
ABN, Publish Date - Jun 09 , 2026 | 11:35 AM
‘నాకు వచ్చిన పని, నచ్చిన పని చేస్తూ మీ అందరి ప్రేమ పొందడం ఆశ్చర్యంగా ఉంది. ‘పెద్ది’ ఎవరో పుష్ చేస్తే చేసిన సినిమా కాదని రామ్ చరణ్ అన్నారు.
‘నాకు వచ్చిన పని, నచ్చిన పని చేస్తూ మీ అందరి ప్రేమ పొందడం ఆశ్చర్యంగా ఉంది. ‘పెద్ది’ (peddi) ఎవరో పుష్ చేస్తే చేసిన సినిమా కాదు. బుచ్చిబాబు (buchibabu sana) చెప్పిన కథను నమ్మి చేసిన చిత్రం. ఈ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నా. థియేటర్‌లో ‘పెద్ది’ సినిమా చూశా. నేను అనుకోని సన్నివేశాలకు కూడా ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం మరిచిపోలేని అనుభూతినిచ్చింది.
నా లైబ్రరీలో నంబర్ వన్‌గా నిలిచే చిత్రమిది. తొలిసారి కథ విన్నప్పుడే బుచ్చిబాబును హగ్ చేసుకున్నా. అంత బాగా వచ్చింది. రిస్క్ అన్న విషయం తర్వాత అర్థమైంది. నిజాయితీగా, మనస్ఫూర్తిగా పని చేస్తే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది అని ‘పెద్ది’ నిరూపించింది. ఇందులో జగపతిబాబు నటన చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి’ అని రామ్‌చరణ్ (ram charan) అన్నారు.
రామ్‌చరణ్ టైటిల్ రోల్‌లో బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సోమవారం థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.
బుచ్చిబాబు సానా మాట్లాడుతూ ‘ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. స్ఫూర్తి నింపే కథ. ‘పెద్ది’ రాసే క్రమంలో ‘ఖేలో ఇండియా’ని కూడా స్ఫూర్తిగా తీసుకున్నా. భారతీయ జీవన విధానంలో ఆట ఓ భాగమని ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకున్నా’ అని తెలిపారు.
సీనియర్ నటుడు జగపతిబాబు మాట్లాడుతూ ‘పెద్ది’ ఆడాడు.. పోరాడాడు.. గెలిచాడు’ అని పెద్దికి బ్యాడ్ రివ్యూస్ రాసినవారికి మరింత థ్యాంక్స్ అని పేర్కొన్నారు. నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ ‘కొత్తదనంతో పాటు ఎమోషనల్ కంటెంట్ కోరుకునే వారికి ‘పెద్ది’ బాగా చేరువవుతోంది’ అని చెప్పారు. ‘నా తొలి సినిమానే ఇంత గొప్ప విజయం సాధించడం జీవితాంతం గుర్తుండిపోయే మూమెంట్’ అని వెంకటసతీశ్‌కిలారు అన్నారు.