డేవిడ్ రెడ్డి కోసం మారిన మనోజ్!
ABN, Publish Date - Mar 11 , 2026 | 10:22 AM
మంచు మనోజ్ తన తాజా చిత్రం 'డేవిడ్ రెడ్డి' కోసం మేకోవర్ అవుతున్నారు. మిరాయ్ సినిమా విజయంతో మనోజ్‌కు భిన్నమైన పాత్రలు చేసే అవకాశం లభిస్తోంది.
మంచు మనోజ్ (Manchu Manoj) సెకండ్ ఇన్నింగ్స్‌లో భిన్నమైన పాత్రలను, సినిమాలనూ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్... ఫ్యాన్స్ సహా సినీ వర్గాలను ఆకర్షిస్తోంది. మనోజ్ తన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించిన అప్‌డేట్‌ను షేర్ చేశారు. రాబోయే సినిమాల కోసం గత మూడు వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నానని ఈ పోస్ట్‌లో వెల్లడించారు. ఆయన పోస్ట్ చేసిన వర్కౌట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటుడిగా మనోజ్ చూపిస్తోన్న పట్టుదల, కృషిని అందరూ అభినందిస్తున్నారు.
ఆ పోస్ట్‌లో మనోజ్ తన నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండటానికి సాకులు వెతకకుండా వాటిని పక్కన పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. 'మూడు వారాల క్రితం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక సౌకర్యంతో రాజీ పడటం లేదు. సాకులు చెప్పాలని అనుకోవటం లేదు. కేవలం కష్టం మాత్రమే' అని అందులో అన్నారు. ఆ క్రమంలోనే యాక్షన్ సినిమాలు చేయడం ఎంత కష్టమో కూడా మనోజ్ వివరించారు. 'యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ నటించలేరు. ప్రతి పంచ్, ప్రతి దెబ్బకు మీ శరీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయట పడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు' అని అన్నారు.
ఇకపై కేవలం లుక్ కోసం కాకుండా, శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే కూడా తాను దృష్టి పెట్టానని మనోజ్ చెప్పారు. తన లక్ష్యం ధృడమైన వ్యక్తిలా తయారవడం అని పేర్కొన్నారు. మూడు వారాల క్రితం ఈ ప్రయాణం మొదలైందని, కేవలం 21 రోజుల్లోనే తాను పూర్తిగా వేరే వ్యక్తిలా అనిపిస్తున్నానని మనోజ్ తెలియజేశారు.
సినిమాల విషయానికి వస్తే... మంచు మనోజ్ చేస్తోన్న 'డేవిడ్ రెడ్డి' (David Reddy) మూవీ ఆయన కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాను హనుమ రెడ్డి యెక్కంటి తెరకెక్కిస్తున్నారు. ఎన్. వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1897 - 1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. అణచివేతకు వ్యతిరేకంగా ఎదురు తిరిగిన ఒక యోధుడి జర్నీని ఇందులో చూపిస్తున్నారు. అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'డేవిడ్ రెడ్డి' గ్లింప్స్‌కు అన్నీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. దీంతో మనోజ్ న్యూ అవతార్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.