Bethlehem Kutumba Unit: మమితా బైజు మళ్ళీ వచ్చేస్తోంది!
ABN, Publish Date - Aug 25 , 2026 | 11:14 AM
ఓనమ్ కానుకగా విడుదలైన మమితా బైజు తాజా మలయాళం చిత్రం 'బెత్లెహెం కుడుంబ యూనిట్' తెలుగులో సెప్టెంబర్ 4న జనం ముందుకు రాబోతోంది. ఈ యేడాది ఆమె నటించగా విడుదలౌతున్న నాలుగో చిత్రం ఇది.
మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ ఓనమ్ పండగ సందర్భంగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆగస్ట్ 21న విడుదలైన అతని తాజా చిత్రం 'బెత్లెహెం కుడుంబ యూనిట్' చక్కని విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గిరీశ్ ఎ.డి. రూపొందించారు. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. ఈ చిత్రంలో జస్టిన్ పాత్రలో నివిన్ పాలీ సాలిడ్ పర్ ఫార్మెన్స్ కు ప్రతి ఒక్కరి ప్రశంసలు దక్కుతున్నాయి. గతేడాది 'సర్వంమాయ'తో హిట్ కొట్టిన నివిన్ పాలీ ఈ ఏడాది 'బెత్లెహెం కుడుంబ యూనిట్' తో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంలోని కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాయి.
విశేషం ఏమంటే... ఈ సినిమా సెప్టెంబర్ 4న తెలుగులో డబ్ అయ్యి, జనం ముందుకు రాబోతోంది. ఇందులో నాయికగా నటించిన మమితా బైజుకు తెలుగులో ఈ యేడాది వస్తున్న నాలుగో సినిమా ఇది. ఏప్రిల్ 30న విడుదలైన ధనుష్ 'కర' సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. అలానే జూలై 23న విడుదలైన విజయ్ 'జన నాయగన్'లో ఆమె కీలక పాత్రను పోషించింది. ఆగస్ట్ 14న వచ్చిన సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'లో హీరోయిన్‌గా చేసింది. ఇప్పుడు ఆమె నటించిన 'బెత్లెహెం కుటుంబ యూనిట్' సెప్టెంబర్ 5న తెలుగు రావడంతో వరుసగా మూడు నెలల్లో ఆమె నటించిన మూడు సినిమాలు తెలుగులో వచ్చినట్టు అవుతోంది.
ఇదిలాఉంటే... ఓనమ్ కే విడుదల కావాల్సి ఉన్న దుల్కర్ సల్మాన్ 'ఐ యామ్ గేమ్' మూవీని మలయాళ, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 4న విడుదల చేయబోతున్నారు. ఓనమ్ సందర్భంగా మలయాళంలో 'ఐ యామ్ గేమ్, బెత్లెహెం కుడుంబ యూనిట్' పోటీ నుంచి తప్పించుకున్నాయి కానీ తెలుగులో మాత్రం ఈ రెండు చిత్రాలు సెప్టెంబర్ 4న ఒక దానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. అదే వారంతంలో ఇప్పటికే 'రోమాంచకం' సెప్టెంబర్ 3న, 'రంభ ఊర్వశి మేనక', ధర్మస్థల నియోజక వర్గం, సహ' చిత్రాలు సెప్టెంబర్ 4న రాబోతున్నాయి. వీటిల్లో ఏ యే చిత్రాలు విజయాన్ని అందుకుంటాయో చూడాలి.
ఇవీ చదవండి:
బీజేపీపై సంచలన ఆరోపణలు.. విజయ్ ‘టీవీకే’లోకి నటుడు దేవన్
'ఇరుముడి' సినిమాపై వివాదం! ఆ సన్నివేశాలు తొలగించాలని డిమాండ్