మమిత బైజు ఏఐ వీడియో.. ఇంతకన్నా దారుణం ఉంటుందా?
ABN , Publish Date - Nov 23 , 2026 | 10:23 AM
మమితా బైజు, ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ సినిమా ఫుటేజ్‌తో అభ్యంతరకరమైన ఏఐ డీప్‌ఫేక్ వీడియో రూపొందించడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పెరుగుతున్న టెక్నాలజీ సెలబ్రిటీల పాలిట శాపంగా మారింది. మంచి, అభివృద్దికి ఉపయోగించాల్సిన టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరమైన డీప్‌ఫేక్ కంటెంట్‌ను సృష్టించడం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే రష్మిక మందన్నా, జాన్వీకపూర్; మృణాల్ ఠాకూర్ ఇలా చాలామంది సెలబ్రిటీలు ఏఐ వీడియోలతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అలాంటి వీడియోనే మరొకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మలయాళ నటి మమితా బైజు, ప్రదీప్ రంగనాథన్‌పై మాటల్లో చెప్పలేని తరహాలో ఓ వీడియోను ఏఐలో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు ఆకతాయిలు. మమితా, ప్రదీప్ కలిసి నటించిన 'డ్యూడ్' సినిమా ఫుటేజ్‌ను ఉపయోగించి, వారి అనుమతి లేకుండా అభ్యంతరకరమైన ఏఐ వీడియోను రూపొందించారు. భావోద్వేగభరితంగా సాగే ఆ సన్నివేశాన్ని పోర్న్ వీడియో తరహాలో జుగుప్సాకరంగా రూపొందించారు. మాటల్లో వర్ణించలేనంత అసభ్యకరంగా ఆ వీడియో ఉంది. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఇలాంటి కంటెంట్‌ను సృష్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇంతకన్నా దారుణమైన చర్య ఉండదని మరికొందరు మంది పడుతున్నారు. వినోదం కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను ఇలా దుర్వినియోగం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.
ఓ కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని, కన్నీళ్లు పెట్టుకున్నానని వెల్లడించడం ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. ఏఐ సాంకేతికతను కొత్త ఆవిష్కరణలకు, సమాజానికి ఉపయోగపడే పనులకు వినియోగించాలి తప్ప.. ఇతరుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉపయోగించకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ రష్మిక మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి పలువురు సినీ తారలు డీప్‌ఫేక్ వీడియోల సమస్యను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మమితా బైజు, ప్రదీప్ రంగనాథన్ పేర్లు కూడా ఈ జాబితాలో చేరడం ఆందోళన కలిగిస్తోంది. సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు కూడా ఇలాంటి ఏఐ దుర్వినియోగానికి బాధితులయ్యే ప్రమాదం ఉందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన వీడియోలను షేర్ చేయకుండా, వాటిని గుర్తించిన వెంటనే సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఫిర్యాదు చేయాలని అభిమానులు కోరుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, దాన్ని ఉపయోగించే వ్యక్తుల్లో బాధ్యత, నైతికత కూడా అంతే అవసరమనే చర్చ ఈ ఘటనతో మరోసారి తెరపైకి వచ్చింది.
డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్లకు సంబంధించిన మార్ఫింగ్ వీడియో వివాదం నేపథ్యంలో చిరంజీవి గతంలోనూ ఏఐ దుర్వినియోగంపై స్పందించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా వినతిపత్రం సమర్పించారు. నవంబర్ 2న హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఈ సమస్యను ఆయన ప్రస్తావించారు. అనంతరం అమిత్ షా సూచన మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని నవంబర్ 16న సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ALSO READ:
నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీనే..: రకుల్
‘భోగి’ ట్రైలర్.. ఘడియలు దగ్గర పడ్డాయ్.. గంగా గాడి కోత మొదలు
ఎవరిపైనైనా క్రష్ ఉందా? అంటే.. మీనూ పాప షాకింగ్ ఆన్సర్